ఒక్కటే ఒక్క పిలుపు… యావత్ భారత దేశం దీపాల వెలుగులో మెరిసిపోయింది. 130 కోట్ల మంది ప్రజలు మతాలను, కులాలను, రాజకీయాలను, ద్వేషాలను పక్కన పెట్టి అందరూ కరోనా వైరస్ ని దేశం నుంచి తరిమి కొట్టడానికి ముందుకి వచ్చారు. సామాన్య రైతు నుంచి పారిశ్రామిక వేత్త వరకు… స్కూల్ పిల్లాడి నుంచి డాక్టరేట్ విద్యార్ధి వరకు, చిరు ఉద్యోగి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు…
కార్యకర్త నుంచి పార్టీ అధినేత వరకు… సర్పంచ్ నుంచి రాష్ట్రపతి వరకు ప్రతీ ఒక్కరు సరిగా 9 గంటలకు ముందుకి వచ్చి దీపాలను వెలిగించారు. హిందు మతం అయితే వారి సాంప్రదాయం ప్రకారం ప్రమిదలు వెలిగిస్తే ఇతర మతాలు కొవ్వొత్తులు వెలిగించాయి. దీపాలు అందుబాటులో లేని వారు కొవ్వోతులు వెలిగించి ఐక్యతను చాటారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు… అనంతపురం నుంచి అసోం వరకు…
ఇలా ప్రతీ ఒక్క ప్రాంతంలో కులాలకు మతాలకు అతీతంగా దీపాలు వెలిగాయి. కరోనాపై పోరాటంలో 130 కోట్ల మంది మేము ఒక్కటే… కరోనా చీకట్లను తరిమేస్తాం అంటూ ప్రతీ ఒక్కరు ముందుకి వచ్చారు. ప్రధాని పిలుపుతో రాష్ట్రపతి, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు, సినీ, క్రీడా ప్రముఖులు, వ్యాపారవేత్తలు అందరూ కూడా తమ తమ ఇళ్ళల్లో దీపాలు వెలిగించి భారతావని ఐఖ్యతను అత్యంత ఘనంగా చాటారు.
కరోనా దీపాలతో పోతుందా అని ప్రశ్నించిన వాళ్ళు కూడా దీపాలు వెలిగించడానికి ముందుకి వచ్చారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య ఇలా ప్రతీ ఒక్కరు కూడా దీపాలు వెలిగించారు. ఆసేతు హిమాచలం దీపాల కాంతిలో మెరిసిపోయింది. ప్రతీ రాష్ట్రంలో కూడా కొవ్వొత్తులు, దీపాలు పండు వెన్నెలను తలపించాయి. పనులు అన్నీ పక్కన పెట్టి… నాకు మీ 9 నిమిషాలు ఇవ్వండి అంటూ మోడీ అడగగానే ముందుకి వచ్చింది యావత్ భారతం.
ప్రజలు అందరూ కూడా ఇలా ముందుకి వచ్చి దీపాలు వెలిగించడం చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. దేదీప్యమానంగా వెలిగిపోయింది భారతం. విదేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా దీపాలు వెలిగించారు. తమ తమ ఇంట్లో లైట్స్ ఆపేసి, అమెరికా, ఆఫ్రికా, యూరప్ ఇలా అన్ని ఖండాల్లో మన భారతీయులు దీపాలు వెలిగించారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే చరిత్రలో ఎన్నడూ చూడని దీపాల వెలుగుని భారతావని చూసింది.