టికెట్‌ రిజర్వేషన్లను నిలిపివేసిన ఏపీఎస్‌ ఆర్టీసీ..

-

ఏప్రిల్‌ 15 నుంచి ప్రయాణాలు చేసేందుకు వీలుగా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ కల్పించిన ఏపీఎస్‌ ఆర్టీసీ ఇప్పుడు ఆ ప్రక్రియను నిలిపివేసింది. ఏప్రిల్‌ 14వ తేదీతో లాక్‌డౌన్‌ ముగుస్తుందని భావించిన అధికారులు.. ఆ తర్వాత రోజు నుంచి నాన్‌ ఏసీ బస్సుల్లో రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లాక్‌డౌన్‌ పొడగింపు సంకేతాలు వెలువడంతో ఆర్టీసీ అధికారులు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ నిలిపివేశారు.

హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులకు అడ్వాన్స్‌డ్‌ రిజర్వేషన్‌ నిలిపివేస్తున్నట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే ఏపీలో అన్ని ప్రాంతాలకు రెండు వైపులా బుకింగ్‌ను ఆపేశారు. ఒకవేళ లాక్‌డౌన్‌ కొనసాగిన నేపథ్యంలో ఇప్పటివరకు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి పూర్తి సొమ్ము తిరిగి చెల్లిస్తామని అధికారులు వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ కూడా బుధవారం వివిధ పార్టీల పార్లమెంటరీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్‌ పొడగింపుకు సంబంధించి సంకేతాలు ఇవ్వడంతో ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు ఈ నిర్ణయం తీసకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆర్టీసీ అధికారులు ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే పెద్ద ఎత్తున టికెట్లు బుక్కయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌ రూట్‌లో 15వ తేదీకి మొత్తం 200 బస్సులకు రిజర్వేషన్‌ అవకాశం ఇవ్వగా మొత్తం 7 వేల టిక్కెట్లు ప్రయాణికులు కొనుగోలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news