పెళ్లైన కొత్తలో ఉండే ఆ ప్రేమ జ్వాల ఆ ఉత్సాహం కొద్ది సంవత్సరాల తరువాత తగ్గిపోవడం చాలా మంది దంపతుల జీవితంలో సహజంగా జరుగుతుంది. జీవితంలో ఉండే బాధ్యతలు, పిల్లలు, ఉద్యోగ ఒత్తిడి కారణంగా భాగస్వాముల మధ్య ఉండే ‘స్పార్క్’ మసకబారుతుంది. మీ బంధంలో కూడా ఆ పాత అనుబంధం అన్యోన్యత లోపించిందని భావిస్తున్నారా? అయితే భయపడకండి, కొన్ని చిన్న మార్పులతో మీ దాంపత్య జీవితంలో ప్రేమను మళ్లీ చిగురింపజేయవచ్చు. ఆ పాత మాధుర్యాన్ని తిరిగి ఎలా పొందవచ్చో చూద్దాం.
ముఖ్యంగా మీ భాగస్వామికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. బిజీ షెడ్యూల్‌లో కూడా రోజుకు కనీసం 15 నిమిషాలు కేవలం మీ ఇద్దరి కోసం మాత్రమే కేటాయించండి. ఆ సమయంలో ఫోన్లు, టీవీ లేదా ఇతర పనులకు దూరంగా ఉండండి. ఆ రోజు జరిగిన విషయాలు ఆలోచనలు లేదా కేవలం సరదాగా మాట్లాడుకోండి. అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోండి.
మీరు మొదట కలుసుకున్న రోజు మీకు ఇష్టమైన ప్రదేశాలు లేదా మొదటి డేటింగ్ గురించి మాట్లాడుకోవడం వల్ల పాత ప్రేమ మళ్లీ గుర్తుకొస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా కృతజ్ఞత చెప్పడం వారిని పొగడడం మర్చిపోవద్దు. ఉదాహరణకు నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు, మీరు చేసిన ఈ పని చాలా బాగుంది వంటి మాటలు వారిపై మీ ప్రేమను తెలియజేస్తాయి.

దాంపత్య జీవితంలో సాన్నిహిత్యం చాలా కీలకం. సాన్నిహిత్యం అంటే కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు, భావోద్వేగ సాన్నిహిత్యం కూడా అంతే ముఖ్యం. మీ భావాలను, కోరికలను, భయాలను భాగస్వామితో పంచుకోవడం ద్వారా వారిపై మీ నమ్మకం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన పనులు చేయడం ద్వారా ఆనందాన్ని పెంచవచ్చు.
మీ భాగస్వామికి ఇష్టమైన బహుమతి ఇవ్వడం వారికి ఇష్టమైన వంటకం చేయడం లేదా ఎటువంటి కారణం లేకుండా వారికి పూలు ఇవ్వడం వంటివి చేయండి. కనీసం నెలకు ఒకసారి పిల్లల బాధ్యతలను పక్కన పెట్టి, కేవలం మీ ఇద్దరే బయటకు వెళ్లి డేటింగ్‌కు వెళ్లడం లేదా చిన్న ట్రిప్‌కు ప్లాన్ చేయడం వల్ల మీ బంధం కొత్తగా చిగురిస్తుంది.
దాంపత్య జీవితంలో ప్రేమ, ఆనందం చిగురించాలంటే ముఖ్యంగా కావాల్సింది ప్రయత్నం. ఇది ఏ ఒక్కరి బాధ్యత కాదు మీ ఇద్దరి ఉమ్మడి బాధ్యత. చిన్న చిన్న ప్రేమ చర్యలు ఒకరికొకరు ఇచ్చే గౌరవం మరియు ఇష్టాయిష్టాలకు ఇచ్చే ప్రాధాన్యత మీ బంధంలో మళ్లీ కొత్త వెలుగును ఆ స్పార్క్‌ను తీసుకువస్తాయి. కేవలం ఎదురుచూడకుండా ఈరోజే ఆ ప్రేమను పంచడం మొదలు పెట్టండి, మీ బంధం ఖచ్చితంగా బలపడుతుంది అంటున్నారు నిపుణులు.
గమనిక: మీ దాంపత్య జీవితంలో సమస్యలు తీవ్రంగా ఉన్నట్లయితే లేదా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోతే, వెంటనే ఒక సంబంధాల కౌన్సెలర్ ను సంప్రదించడం ద్వారా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.
