కపుల్స్ ప్రేమ అనుబంధం అంటే పెద్ద పెద్ద బహుమతులు, రొమాంటిక్ ట్రిప్పులు మాత్రమే కాదనుకుంటారు. నిజానికి మీ భాగస్వామితో మరింత లోతుగా సన్నిహితంగా ఉండడాన్ని ప్రభావితం చేసేవి రోజువారీ జీవితంలోని అతి చిన్న విషయాలే! మనసు లోతుల్లోంచి వచ్చే ఆ చిన్న ప్రయత్నాలు, సంజ్ఞలే బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. చాలా మంది పట్టించుకోరు కానీ బంధంలో మ్యాజిక్ సృష్టించే ఆ ‘చిన్న చిన్న’ రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూ వారి చిన్న చిన్న సంభాషణల శక్తి: ఒక భాగస్వామితో క్లోజ్‌గా ఉండడం అనేది కేవలం ముఖ్యమైన సంఘటనల సమయంలోనే కాకుండా, సాధారణ రోజుల్లో చేసే చిన్న చిన్న సంభాషణలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఆఫీస్ నుండి వచ్చాక వెంటనే టీవీ ఆన్ చేయకుండా, మీ భాగస్వామికి కాఫీ ఇచ్చి “ఈ రోజు నీకు ఎలా గడిచింది?” అని మనస్ఫూర్తిగా అడగడం చాలా ముఖ్యం. ఇది కేవలం మాట మాత్రమే కాదు ‘నేను నీ గురించి ఆలోచిస్తున్నాను’ అనే భావనను తెలియజేస్తుంది.
అలాగే చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోవడం, వారికి ఇష్టమైన స్నాక్ కొనడం, వారు చెప్పిన కథలోని వివరాలను తరువాత ప్రస్తావించడం, ఇవన్నీ మీరు వారిని ఎంత శ్రద్ధగా వింటున్నారో తెలియజేస్తాయి. ఈ చిన్న ప్రయత్నాలు భావోద్వేగ సాన్నిహిత్యాన్ని పెంచుతాయి, ఇవి పెద్ద వాటి కంటే ఎక్కువ ప్రభావం చూపుతాయి.

అంచనాలను పక్కన పెట్టి,అంగీకరించడం: బంధంలో సాన్నిహిత్యాన్ని పెంచే మరో కీలక అంశం మీ భాగస్వామిని మార్చడానికి ప్రయత్నించకుండా, వారిని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం. చాలా మంది ‘వారు ఇలా ఉంటే బాగుండు’ ‘నాకు నచ్చినట్టు మారితే క్లోజ్ అవుతా’ అని అనుకుంటారు. కానీ వారి లోపాలను కూడా ప్రేమగా చూడగలిగినప్పుడే అసలైన సాన్నిహిత్యం పెరుగుతుంది.
అలాగే వాదనలు లేదా విభేదాలు వచ్చినప్పుడు కూడా, పారిపోకుండా లేదా ఆర్గ్యుమెంట్ చేయకుండా “సరే నేను నీ బాధను అర్థం చేసుకున్నాను” అని చెప్పి వారి భావోద్వేగాలను ధృవీకరించడం చాలా అవసరం. ఈ ధృవీకరణ అనేది ‘నన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా నువ్వు ఉన్నావు’ అనే భద్రతా భావాన్ని పెంచుతుంది. ఇది మానసికంగా మరింత దగ్గరగా ఉండేలా చేస్తుంది.

ఫిజికల్ టచ్ (స్పర్శ): మాటలు చెప్పలేని లోతైన అనుభూతిని అందించేది స్పర్శ. ఇది కేవలం రొమాంటిక్ సందర్భాలలోనే కాదు, రోజూ వారి జీవితంలోనూ కీలకం. సోఫాలో కూర్చున్నప్పుడు వారి చేయి పట్టుకోవడం, పక్క నుండి వెళుతున్నప్పుడు నడుంపై సున్నితంగా తట్టడం, గుడ్ బై చెప్పేటప్పుడు ఇచ్చే గట్టి ఆలింగనం, ఇవి శరీరంలో ఆక్సిటోసిన్ అనే “లవ్ హార్మోన్” విడుదలయ్యేలా చేస్తాయి. ఈ హార్మోన్ బంధాన్ని బలోపేతం చేస్తుంది.
అంతేకాక మీ భాగస్వామి కళ్లలోకి చూస్తూ మాట్లాడటం, చిరునవ్వు ఇవ్వడం వంటి మాటలు లేని సంకేతాలు కూడా మీరు వారికి ఎంత అందుబాటులో ఉన్నారో మరియు వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తాయి.
