ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చూసినా సెలబ్రిటీలను అనుసరించినా, నిత్యం ఏదో ఒక కొత్త ట్రెండింగ్ డైట్ (Trending Diet) మన దృష్టిని ఆకర్షిస్తుంది.పేర్లు ఎన్నో వున్నాయి ముఖ్యం గా కీటో ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్, వీగన్ వంటి ఈ డైట్‌లు తక్కువ సమయంలో బరువు తగ్గే అద్భుత పరిష్కారాలుగా ప్రచారం చేయబడుతున్నాయి. కానీ వాటిల్లో చాలా వరకు కేవలం ఫ్యాడ్స్ మాత్రమే. మరి ఈ ఆహార నియమాలు నిజంగా పనిచేస్తాయా? పనిచేస్తే వాటి ప్రభావం ఎంత కాలం ఉంటుంది? తెలుసుకుందాం.
నిజం చెప్పాలంటే దాదాపు ప్రతి ట్రెండింగ్ డైట్ కూడా మొదట్లో పనిచేసినట్టే అనిపిస్తుంది. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఆ డైట్ ఏదైనా కానీయండి చివరికి మీ శరీరం కేలరీల లోటు (Calorie Deficit) లోకి వెళ్లడం. అంటే మీరు తినే కేలరీల కంటే ఎక్కువ కేలరీలను ఖర్చు చేయడం.
ఉదాహరణకు, కీటో డైట్‌లో కార్బోహైడ్రేట్‌లను పూర్తిగా తగ్గించడం వల్ల, ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్‌లో ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడం వల్ల మీరు తెలియకుండానే మొత్తం తక్కువ కేలరీలను తీసుకుంటారు. ఫలితంగా, తక్కువ సమయంలో బరువు తగ్గినట్టు కనిపిస్తారు. ఈ త్వరగా బరువు తగ్గడంలో చాలావరకు శరీరంలోని నీరు కోల్పోవడం కూడా ఒక కారణం.

అయితే ఈ ట్రెండింగ్ డైట్‌లు చాలావరకు సుదీర్ఘ కాలం పాటించడానికి కష్టమైనవిగా ఉంటాయి. వాటిలో పోషకాలు తక్కువగా ఉండవచ్చు లేదా కొన్ని ఆహార సమూహాలను పూర్తిగా నిషేధించడం వల్ల మీకు ఆకలి, అలసట పెరగవచ్చు. ఒకసారి మీరు ఆ డైట్‌ను ఆపివేసిన వెంటనే, కోల్పోయిన బరువు తిరిగి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ.
ఆరోగ్యకరమైన బరువు తగ్గడానికి మరియు దానిని కొనసాగించడానికి ఏ ఒక్క ‘ట్రెండింగ్ డైట్’ ముఖ్య పరిష్కారం కాదు. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, మరియు మంచి జీవనశైలి మార్పులు మాత్రమే దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి. కాబట్టి ట్రెండ్‌లను గుడ్డిగా ఫాలో అవ్వకుండా, మీ ఆరోగ్యానికి తగిన ఆహార నియమాన్ని ఎంచుకోవడం ముఖ్యం అంటున్నారు నిపుణులు.
