రంజాన్ మాసం ప్రారంభమవుతుందంటే చాలు.. ఎక్కడ చూసినా హలీం ఘుమఘుమలు నోరూరిస్తుంటాయి. కేవలం ముస్లింలే కాదు.. భోజన ప్రియులందరూ.. రంజాన్ మాసంలో హలీంను ఎక్కువగా తింటుంటారు. ఇక హైదరాబాద్ అయితే హలీం తయారీకి చాలా ఫేమస్. నగరం నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు, విదేశాలకు పెద్ద ఎత్తున హలీంను ఎగుమతి చేస్తుంటారు. అయితే కరోనా దెబ్బకు ఈసారి హలీం తయారీదార్లకు పెద్ద ఎత్తున నష్టం వచ్చే అవకాశం ఉండగా.. భోజన ప్రియులు ఈసారి హలీంను మరిచిపోవాల్సిందేనని తెలుస్తోంది..!
ఈ ఏడాది రంజాన్ మాసం ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది. మే 25న రంజాన్ పండుగ జరగనుంది. ఇక రంజాన్ మాసం ప్రారంభానికి మరో 12 రోజుల సమయం మాత్రమే ఉన్నందున.. హలీం తయారీదార్లు.. ఈ సారి వ్యాపారం ఎలా జరుగుతుంది..? లాక్‌డౌన్ ఎత్తేసినా.. హలీం అమ్మేందుకు ప్రభుత్వం అనుమతినిస్తుందా..? వ్యాపారం జరుగుతుందా..? అని ఆలోచిస్తుండగా.. హలీంను తయారు చేసే చిరువ్యాపారులు, అమ్మే చిరు ఉద్యోగులు ఈసారి ఉపాధి లేకుండా పోతుందని.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఏప్రిల్ 25న రంజాన్ మాసం ఆరంభం అయినా.. లాక్‌డౌన్ 30వ తేదీతో ముగుస్తుంది కనుక.. ఒక్క 5 రోజులు ఓపిక పడితే.. ఆ తరువాత నుంచి హలీంను అమ్ముకుందాం.. అన్నట్లుగా కూడా లేదు. ఎందుకంటే లాక్‌డౌన్ ఎత్తేశాక కూడా చాలా రోజుల వరకు ఆంక్షలను సడలించరు. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తేస్తారు. దీంతో హలీం అమ్మడం కష్టమే అవుతుంది. అయితే సామాజిక దూరం పాటిస్తూ హలీంను అమ్ముకునేలా.. కేవలం దాన్ని పార్శిల్ రూపంలో మాత్రమే అమ్మేలా.. ప్రభుత్వం అనుమతిస్తే బాగుంటుందని హోటల్స్, రెస్టారెంట్ల ఓనర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి..!