చలికాలం రాగానే వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం ఎంతో హాయినిస్తుంది. అందుకే చాలామంది తక్కువ ఖర్చుతో వేడి నీటిని ఇచ్చే గ్యాస్ గీజర్లను ఇష్టపడుతుంటారు. అయితే అజాగ్రత్తగా ఉంటే ఈ సౌకర్యమే శాపంగా మారే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో బాత్రూమ్లోనే స్పృహ తప్పి పడిపోవడం, మరణించడం వంటి వార్తలు మనం వింటున్నాం. అసలు గ్యాస్ గీజర్ల వల్ల ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి? మనం చేసే చిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు ఎలా వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
గ్యాస్ గీజర్లు పనిచేయడానికి ఎల్పిజి (LPG) గ్యాస్‌ను ఇంధనంగా వాడుకుంటాయి. గ్యాస్ మండినప్పుడు అక్కడ ఆక్సిజన్ ఖర్చవుతుంది. బాత్రూమ్ చిన్నదిగా ఉండి, గాలి వెళ్లేందుకు సరైన వెలుతురు (Ventilation) లేకపోతే అక్కడ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి ప్రమాదకరమైన ‘కార్బన్ మోనాక్సైడ్’ గ్యాస్ విడుదలవుతుంది.
ఇది రంగు, రుచి, వాసన లేని వాయువు కావడంతో మనం పీలుస్తున్నామనే విషయం కూడా గ్రహించలేం. ఈ గ్యాస్ రక్తంలోని హిమోగ్లోబిన్‌తో కలిసి మెదడుకు అందే ఆక్సిజన్‌ను నిలిపివేస్తుంది. దీనివల్ల స్నానం చేసే వ్యక్తికి తెలియకుండానే కళ్లు తిరగడం, ఊపిరి ఆడకపోవడం జరిగి క్షణాల్లో స్పృహ తప్పి పడిపోతారు.

చాలామంది బాత్రూమ్ తలుపులు, కిటికీలు పూర్తిగా మూసివేసి గీజర్ ఆన్ చేస్తారు, ఇదే అతిపెద్ద ప్రమాదం. గీజర్ నుండి వెలువడే పొగ బయటకు వెళ్లడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేకపోవడం వల్ల విషవాయువులు గదిలోనే నిండిపోతాయి. ఈ ప్రమాదాల నుండి తప్పించుకోవాలంటే గీజర్‌ను వీలైనంత వరకు బాత్రూమ్ బయట అమర్చుకోవడం ఉత్తమం.
ఒకవేళ లోపలే ఉంటే, స్నానానికి వెళ్లే ముందే నీటిని బకెట్లో పట్టుకుని గీజర్ ఆఫ్ చేసి, ఆ తర్వాతే తలుపు వేసుకుని స్నానం చేయాలి. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం హాయిగా వేడి నీటి స్నానాన్ని ఆస్వాదించవచ్చు మరియు ప్రాణాపాయం నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
మీ బాత్రూమ్లో గ్యాస్ గీజర్ ఉంటే వెంటనే వెెంటిలేషన్ తనిఖీ చేయండి. స్నానం చేసేటప్పుడు ఎవరికైనా వికారం లేదా తలనొప్పిగా అనిపిస్తే వెంటనే బయటకు వచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి.
