గర్భస్రావం లేదా అబార్షన్ అనేది ఒక మహిళ జీవితంలో శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిడిని కలిగించే క్లిష్టమైన సమయం. ఈ దశలో శరీరం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి సాధారణ స్థితికి రావడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది మహిళలు దీనిని సాధారణ విషయంగా భావించి వెంటనే పనుల్లో పడిపోతుంటారు కానీ సరైన విశ్రాంతి తీసుకోకపోతే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ, మళ్ళీ శక్తిని ఎలా పుంజుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అబార్షన్ తర్వాత మొదటి రెండు వారాలు చాలా కీలకమైనవి. ఈ సమయంలో కనీసం వారం రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలి. భారీ వస్తువులను ఎత్తడం లేదా కఠినమైన వ్యాయామాలు చేయడం అస్సలు మంచిది కాదు. శారీరక మార్పుల వల్ల రక్తస్రావం మరియు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది, కాబట్టి డాక్టర్ సూచించిన మందులను సమయానికి వాడాలి.

ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా అబార్షన్ తర్వాత కనీసం రెండు నుండి మూడు వారాల వరకు సన్నిహిత సంబంధాలకు దూరంగా ఉండటం మంచిది. ఇది గర్భాశయం కోలుకోవడానికి మరియు ఇన్ఫెక్షన్ల బారి నుండి రక్షణ పొందడానికి సహాయపడుతుంది.
ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కోల్పోయిన రక్తాన్ని తిరిగి పొందడానికి ఐరన్ కాల్షియం మరియు విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ మరియు తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి.
అలాగే మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం, ఈ సమయంలో కలిగే బాధను లేదా ఆందోళనను మీ భాగస్వామితో లేదా సన్నిహితులతో పంచుకోండి. సరైన పోషకాహారం తగినంత నీరు మరియు ప్రశాంతమైన నిద్ర మీ శరీరం త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి.
గమనిక: అబార్షన్ తర్వాత విపరీతమైన రక్తస్రావం, తీవ్రమైన కడుపు నొప్పి, లేదా అధిక జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే మీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి.
