ఊపిరితిత్తుల క్యాన్సర్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ధూమపానం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ మధ్యకాలంలో అసలు పొగ తాగని వారిలో (Non-smokers) కూడా ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. నేను ఎప్పుడూ సిగరెట్ ముట్టుకోలేదు,పొగాకు ఎలావుంటుందో చూడలేదు కదా నాకు రాదులే అనే ధీమా ఇప్పుడు సరికాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పొగతాగని వారికి ఈ వ్యాధి ఎందుకు వస్తోంది? మనం తెలియకుండా చేస్తున్న తప్పులేంటి? దీని గురించి అప్రమత్తంగా ఉండటం ఎంత అవసరమో తెలుసుకుందాం..
కాలుష్యం మరియు ప్యాసివ్ స్మోకింగ్: ధూమపానం చేయని వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం మనం పీల్చే గాలిలోని కాలుష్యం. పట్టణాల్లో పెరిగిపోతున్న వాహనాల పొగ, పరిశ్రమల వ్యర్థాలు ఊపిరితిత్తులను దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు ‘ప్యాసివ్ స్మోకింగ్’ (పక్కన వారు వదిలే పొగను పీల్చడం) అత్యంత ప్రమాదకరంగా మారింది.
అలాగే, మన ఇళ్లలో గోడలు, నేలల నుండి వెలువడే అదృశ్య ‘రాడాన్’ గ్యాస్ మరియు వంటగదిలోని పొగ కూడా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మనం ఎంతో సురక్షితం అనుకునే మన పరిసరాల్లోనే ఈ క్యాన్సర్ కారకాలు దాగి ఉండటం ఆందోళన కలిగించే విషయం.

జన్యు మార్పులు మరియు జీవనశైలి ప్రభావం: ధూమపానం చేసేవారిలో వచ్చే క్యాన్సర్‌కు, చేయని వారిలో వచ్చే క్యాన్సర్‌కు జన్యుపరమైన తేడాలు ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. నాన్-స్మోకర్లలో కణాలలోని DNA లో వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల క్యాన్సర్ గడ్డలు ఏర్పడవచ్చు.
అలాగే, వృత్తిరీత్యా ఆస్బెస్టాస్, ఆర్సెనిక్ వంటి రసాయనాల మధ్య పనిచేసే వారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలామంది దీనిని సాధారణ దగ్గు లేదా అలర్జీగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీర్ఘకాలికంగా వేధించే దగ్గు, రొమ్ము నొప్పి, ఆయాసం వంటి సంకేతాలను అస్సలు విస్మరించకూడదు.
అప్రమత్తతే ఆయుధం: ఈ మహమ్మారి బారి నుండి తప్పించుకోవాలంటే మన జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరి. బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ధరించడం, ఇంట్లో సరైన గాలి వెలుతురు ఉండేలా చూసుకోవడం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇక చివరగా చెప్పాలంటే.. క్యాన్సర్ ఎవరికైనా రావచ్చు, కానీ సరైన అవగాహన మరియు ముందస్తు పరీక్షల ద్వారా దానిని జయించవచ్చు. పొగ తాగని వారు కూడా తమ శ్వాసకోశ ఆరోగ్యంపై నిరంతరం నిఘా ఉంచడం నేటి కాలంలో అత్యంత అవసరం.
