కొందరికి ప్రయాణం అంటే కొత్త ప్రదేశాలను చూడటం, ఆహ్లాదంగా గడపడం. కానీ, మరికొందరి కి జర్నీ అనగానే వాంతులు, తల తిరగడం వికారం వంటి ‘మోషన్ సిక్నెస్’ సమస్యలు గుర్తొచ్చి భయం వేస్తుంది. కార్లలో లేదా బస్సుల్లో ప్రయాణించేటప్పుడు కలిగే ఈ అసౌకర్యం వల్ల ప్రయాణంలోని అసలు మజానే ఆవిరైపోతుంది. అయితే, కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ సమస్యకు సులభంగా చెక్ చెప్పి, మీ జర్నీని ఎంతో హాయిగా చిరునవ్వుతో ఆస్వాదించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సరైన సీటు ఎంపిక మరియు కూర్చునే విధానం: మోషన్ సిక్నెస్‌ను నివారించడంలో మనం కూర్చునే స్థానం కీలక పాత్ర పోషిస్తుంది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు వీలైనంత వరకు ముందు సీటులో కూర్చోవడానికి ప్రయత్నించండి. బస్సులో అయితే మధ్యలో లేదా ముందు వైపు సీట్లను ఎంచుకోవడం మంచిది.
ప్రయాణ సమయంలో కదులుతున్న వాహనంలో కొందరు చేసే తప్పు పుస్తకాలు చదవడం లేదా మొబైల్ ఫోన్ చూడటం,ఇలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మన కళ్ళు కదలికను చూస్తాయి కానీ మెదడుకు అందే సంకేతాల్లో తేడా వచ్చి వికారం కలుగుతుంది. దానికి బదులుగా కిటికీ గుండా దూరంగా కనిపిస్తున్న స్థిరమైన వస్తువులను లేదా ప్రకృతిని చూడటం వల్ల మెదడు ప్రశాంతంగా ఉండి వాంతులు రాకుండా ఉంటాయి.

ఆహారపు అలవాట్లు మరియు ఇంటి చిట్కాలు: ప్రయాణానికి బయలుదేరే ముందు అతిగా తినడం లేదా ఖాళీ కడుపుతో ఉండటం రెండూ తప్పే. నూనె వస్తువులు, మసాలా ఆహారానికి దూరంగా ఉండి తేలికపాటి భోజనం తీసుకోవాలి. ప్రయాణంలో వికారం అనిపిస్తే అల్లం ముక్కను బుగ్గన పెట్టుకోవడం లేదా అల్లం టీ తాగడం అద్భుతమైన ఫలితాన్నిస్తుంది.
అల్లంలోని ఔషధ గుణాలు కడుపులోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. అలాగే, నిమ్మకాయ వాసన చూడటం లేదా చల్లని నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇక ఎక్కువ గా కార్ లో ఏసీ ఫుల్ గా పెట్టుకొని వెళ్తుంటాం,ఒక్కోసారి ఆ ఏసీ గాలి వల్ల కూడ వికారం అనిపిస్తుంది. అందుకే వాహనంలో గాలి ధారాళంగా ఆడేలా చూసుకోవడం, వీలైతే కిటికీ అద్దాలు కొద్దిగా దించి తాజా గాలిని పీల్చడం వల్ల కూడా మోషన్ సిక్నెస్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ప్రశాంతమైన మనసే అసలైన మందు: మోషన్ సిక్నెస్ అనేది చాలా వరకు మన మానసిక స్థితిపై కూడా ఆధారపడి ఉంటుంది. నాకు వాంతులు అవుతాయి అనే భయం కంటే, ప్రయాణాన్ని ఆస్వాదించాలనే ఉత్సాహంతో ఉండటం ముఖ్యం. నచ్చిన పాటలు వినడం, తోటి ప్రయాణికులతో ముచ్చటించడం ద్వారా మెదడును మళ్లించవచ్చు. ప్రయాణానికి ముందే తగినంత నిద్ర పోవడం వల్ల శరీరం అలసట చెందకుండా ఉంటుంది. ఈసారి జర్నీ కి ఈ ట్రిక్స్ ట్రై చేయండి..
గమనిక: మీకు మోషన్ సిక్నెస్ సమస్య చాలా తీవ్రంగా ఉంటే, ప్రయాణానికి అరగంట ముందు వైద్యుల సలహా మేరకు యాంటీ-వామిటింగ్ మాత్రలు వేసుకోవడం మంచిది.
