పెద్ద నోట్ల రద్దుతో అవినీతిపరుల గుండెల్లో ఆయన గుబులు పుట్టించారు.. జీఎస్టీ బిల్లుతో డొల్ల కంపెనీల భరతం పట్టారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి పాక్ ఆగడాలకు చెక్ పెట్టారు. తరువాత ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ విధించి.. ఆ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేలా ఆయన ధైర్యం చెబుతున్నారు. ఓ వైపు కరోనాను తరిమికొడుతూనే.. మరోవైపు పతనమైన దేశ ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. అవును.. అందుకే ప్రధాని మోదీ ఇప్పుడు ప్రపంచ నాయకుడు (గ్లోబల్ లీడర్) అయ్యారు.
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షున్ని కాదని.. భారత ప్రధాని మోదీనే ప్రపంచ నాయకుడి పీఠం వరించింది. కరోనాను తరిమికొట్టేందుకు మోదీ ధైర్యంగా తీసుకుంటున్న నిర్ణయాలే ఇప్పుడు ఆయన్ను గ్రేట్ లీడర్‌ను చేశాయి. ఆయన ప్రపంచానికంతటికీ కావల్సిన ఒకే ఒక్క నాయకుడయ్యారు. అవును.. ఈ విషయాలను మేం చెప్పడం లేదు. సర్వేలు చెబుతున్నాయి. మార్నింగ్ కన్సల్ట్ అనే ఓ అంతర్జాతీయ పోలింగ్ ఏజెన్సీ జనవరి 1 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా చేసిన పలు సర్వేలు, ఇంటర్వ్యూలను దృష్టిలో ఉంచుకుని.. ప్రధాని మోదీని గ్లోబల్ లీడర్ అని, ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అని పేర్కొంది. దీంతో మోదీని ఇప్పుడు అటు బీజేపీయే కాదు, యావత్ భారతదేశం కీర్తిస్తోంది.
ఇక గ్లోబల్ లీడర్ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న మోదీకి గతంలో 62 శాతం రేటింగ్ ఉండగా.. అదిప్పుడు 68కి పెరిగింది. అందుకనే ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌లను వెనక్కి నెట్టి ప్రపంచ నాయకుడి జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మోదీ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ ముక్త కంఠంతో చెప్పాయి. ఈ క్రమంలో మోదీకి ఈ గౌరవం దక్కడం నిజంగా భారతీయులమైనందుకు మనం గర్వపడాలి.
అయితే మోదీ తరువాతి స్థానంలో బోరిస్ జాన్సన్‌తోపాటు, ఆస్ట్రేలియా స్కాట్ మోరిన్సన్, బ్రెజిల్ జెయిర్ బొల్సనారో, మెక్సికో లోపెజ్ ఒబ్రడార్లు నిలిచారు. తరువాతి స్థానం ట్రంప్‌కు దక్కింది. ఇక ఈ విషయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందిస్తూ.. మోదీ ప్రపంచ నాయకుడని కొనియాడారు. కరోనాను కట్టడి చేసేందుకు ఆయన తీసుకుంటున్న చర్యలు అమోఘమన్నారు. కరోనాపై పోరాటం చేయడంలో ప్రపంచ దేశాలన్నింటికీ మోదీ నాయకత్వం వహిస్తున్నారని అన్నారు.