కరోనా లాక్డౌన్ వల్ల దేశంలోని మధ్యతరగతి వర్గాలకు.. ముఖ్యంగా నెల నెలా పలు రకాల రుణాలకు సంబంధించి ఈఎంఐలు చెల్లించే వారి కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 3 నెలల వరకు మారటోరియం సదుపాయాన్ని కల్పించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు. అయితే చాలా వరకు ఆర్థిక సంస్థలు, బ్యాంకులు కొత్తగా కస్టమర్లకు రుణాలేవీ ఇవ్వడం లేదు. లాక్డౌన్ తరువాత యథావిధిగా కార్యకలాపాలు కొనసాగించవచ్చులేనని.. చాలా సంస్థలు రుణాలను ఇవ్వడం ఆపేశాయి. ఇక ఇదే విషయాన్ని ఆసరగా చేసుకుని పలువురు కేటుగాళ్లు ఏకంగా సోషల్ మీడియాలోనే యాడ్స్ ఇస్తూ.. తక్కువ వడ్డీకే నిమిషాల్లోనే వ్యక్తిగత రుణాలు ఇస్తామంటూ.. పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేస్తున్నారు.
లాక్డౌన్ కారణంగా ఆర్థిక సంస్థలు, బ్యాంకులు లోన్లు ఇవ్వడాన్ని తాత్కాలికంగా ఆపేశాయి. కానీ.. కొందరు ప్రబుద్దులు ఇదే విషయాన్ని అనువుగా చేసుకుని ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. పలు ప్రముఖ ఫైనాన్స్ సంస్థల పేరిట.. అచ్చం ఆ కంపెనీలను పోలి ఉన్న ఫొటోలతో సోషల్ మీడియాలో యాడ్స్ ఇస్తూ.. కేవలం నిమిషాల్లోనే.. తక్కువ వడ్డీకే వ్యక్తిగత రుణాలను ఇస్తామంటూ.. కొందరు నమ్మబలుకుతున్నారు. నిజంగా ఆ యాడ్స్ ఆయా ఫైనాన్స్ సంస్థలకు చెందినవేనని నమ్మిన కొందరు ఆ రుణాలకు అప్లయి చేసి ఎంతో విలువైన తమ వ్యక్తిగత సమాచారాన్ని దుండుగల చేతుల్లో పెడుతున్నారు.
ఇక కొందరు ప్రబుద్దులైతే ఏకంగా.. ప్రాసెసింగ్ చార్జిల పేరిట ముందుగానే కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి తరువాత పత్తా లేకుండా పోతున్నారు. ప్రస్తుతం ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కనుక సోషల్ మీడియాలో మీకు తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటూ.. ఏవైనా యాడ్స్ కనిపిస్తే.. వెంటనే స్పందించకండి. సదరు యాడ్‌ను ఇచ్చింది అసలు ఫైనాన్స్ సంస్థేనా.. బ్యాంకేనా.. అనే అసలు విషయం తెలుసుకున్నాకే.. ముందుకు కొనసాగండి. ఇక మరో విషయం.. ఏ ఆర్థిక సంస్థైనా, బ్యాంకైనా.. ముందుగా ప్రాసెసింగ్ చార్జిలు వసూలు చేయవని తెలుసుకోండి. రుణం మంజూరయ్యాక అందులోంచి ఆ చార్జిలను కట్ చేసి మిగిలిన మొత్తాన్ని ఆయా సంస్థలు మీ బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తాయి. కనుక ప్రాసెసింగ్ చార్జిలను ముందుగా చెల్లించాలని అడిగితే.. కచ్చితంగా వారు మిమ్మల్ని మోసం చేసేందుకు యత్నిస్తున్నారనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఇలాంటి సంఘటనల్లో బాధితులైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు కంప్లెయింట్ ఇవ్వాలి. ఏది ఏమైనా.. ఇలాంటి నేరస్థుల పట్ల ప్రజలు.. ముఖ్యంగా నెటిజన్లు.. తస్మాత్ జాగ్రత్త..!