గూగుల్ ప్లే స్టోర్‌లో ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు లెక్కకు మించిన యాప్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే పలు థర్డ్‌పార్టీ సైట్లలోనూ ఆండ్రాయిడ్ యాప్స్‌ను యూజర్లకు అందిస్తున్నారు. అయితే కొన్ని సార్లు పలు యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే సమయంలో App Not Installed అనే ఎర్రర్ మెసేజ్ మనకు దర్శనమిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి..? అసలు ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చేందుకు కారణాలు ఏముంటాయి..? వాటిని ఎలా క్లియర్ చేసుకుని యాప్స్‌ను మళ్లీ ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి..? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆండ్రాయిడ్ ఫోన్లలో పైన చెప్పిన ఎర్రర్ మెసేజ్ వచ్చేందుకు పలు కారణాలుంటాయి.. అవేమిటంటే…
1. స్టోరేజీ తగినంత లేకపోవడం…
ఆండ్రాయిడ్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లో తగినంత స్పేస్ లేకుండా యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేస్తే.. పైన చెప్పిన ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇలాంటప్పుడు ఫోన్‌లో స్పేస్‌ను క్లియర్ చేసి చూడాలి. దీంతో ఎర్రర్ మెసేజ్ రాకుండా తిరిగి యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
2. కరప్టడ్ ఫైల్స్…
గూగుల్ ప్లే స్టోర్ మాత్రమే కాకుండా.. థర్డ్ పార్టీ సైట్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్స్ లో కొన్నిసార్లు కరప్టడ్ ఫైల్స్ ఉంటాయి. దీని వల్ల కూడా ఆయా యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఇలాంటి సందర్భంగా ఆ యాప్‌కు చెందిన పాత వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వాడాలి. తరువాత బగ్స్ ఫిక్స్ చేసి కొత్త వెర్షన్ వస్తే.. అప్పుడు కొత్త వెర్షన్‌కు యాప్‌ను అప్‌డేట్ చేయాలి. ఇలా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. ఇన్‌స్టాలేషన్ లొకేషన్…
కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో యూజర్లు యాప్‌లను ఎస్డీ కార్డు మెమొరీలో కూడా ఇన్‌స్టాల్ చేసేలా ఫీచర్ అందుబాటులో ఉంటుంది. అయితే పలు యాప్‌లను ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోనే ఇన్‌స్టాల్ చేయాలి. అందుకు తగిన విధంగానే ఆయా యాప్‌లను డెవలప్ చేస్తారు. కనుక యాప్ ఇన్‌స్టాలేషన్ లొకేషన్ చేంజ్ చేస్తే.. ఈ సమస్య పరిష్కారం అవుతుంది. యాప్ ఇన్‌స్టాల్ అవుతుంది.
4. కరప్టడ్ ఎస్డీ కార్డ్…
ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఉన్న ఎస్డీ కార్డ్ కరప్టడ్ అయినా.. కొన్ని సార్లు యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఎందుకంటే పలు యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అవి కొంత మెమొరీని ఎస్‌డీ కార్డు నుంచి వాడుకుంటాయి. అలాంటప్పుడు ఎస్‌డీ కార్డు కరప్ట్ అయితే.. ఆ మెమొరీని అవి తీసుకోలేవు.. కనుక యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎస్‌డీ కార్డును మార్చి చూడాలి.
5. యాప్ పర్మిషన్లు…
ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ పర్మిషన్లు సరిగా పనిచేయకపోయినా.. యాప్స్ ఇన్‌స్టాల్ కావు. ఇందుకు గాను ఫోన్‌లోని సెట్టింగ్స్ విభాగంలోకి వెళ్లి యాప్స్ అనే విభాగంలో ఉండే రీసెట్ యాప్ ప్రిఫరెన్సెస్, రీసెట్ అప్లికేషన్ పర్మిషన్స్ అనే ఆప్షన్లను ఎంచుకోవాలి. దీంతో యాప్స్ ఇన్‌స్టాల్ అవుతాయి.
పైన చెప్పిన చిట్కాలు ఏవీ పనిచేయకపోతే ఫోన్‌ను రీస్టార్ట్ చేసి ఆ తరువాత యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి చూడాలి. అలా కూడా యాప్స్ ఇన్‌స్టాల్ కాకపోతే.. ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాల్సిందే.. దీంతో ఈ సమస్య దాదాపుగా పరిష్కారం అవుతుంది..!