బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కరోనా పేషెంట్ల కోసం తన ప్లాస్మాను దానం చేసింది. ఈ మేరకు ఆమె లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (కేజీఎంయూ) అధికారులను సంప్రదించింది. లండన్‌లో కరోనా బారిన పడి భారత్‌కు వచ్చిన కనికా కపూర్ ఇక్కడ రెండు పెద్ద పార్టీల్లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఆమె పాల్గొన్న పార్టీల్లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. అయితే వారందరీ కరోనా నెగెటివ్ వచ్చింది. ఇక కరోనాకు చికిత్స తీసుకున్న కనికా కపూర్ ఈ మధ్యే హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయింది.
కనికా కపూర్ కరోనా పేషెంట్ల కోసం ప్లాస్మాను దానం చేసినప్పటికీ.. ఆమె రక్తాన్ని ముందుగా వైద్యులు పరీక్షించనున్నారు. ఆమె రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు 12.5కు పైన ఉండాలి. అలాగే ఆమె బరువు 50 కిలోలకు పైగా ఉండాలి. ఇక డయాబెటిస్, గుండె జబ్బులు, మలేరియా, సిఫిలిస్ వంటి వ్యాధులు ఉండరాదు. అవన్నీ నెగెటివ్ వస్తేనే.. ఆమె రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి దాన్ని కరోనా పేషెంట్ల చికిత్సకు ఉపయోగిస్తారు.
కాగా కేజీఎంయూలో ఆదివారం రాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న 58 ఏళ్ల ఓ కరోనా పేషెంట్‌కు ప్లాస్మా థెరపీ చేశారు. ఈ క్రమంలో ఆ పేషెంట్ ఇప్పుడు కోలుకుంటున్నాడని డాక్టర్లు తెలిపారు. కాగా ఢిల్లీ, కేరళ సహా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీని అత్యవసర పరిస్థితిలో ఉన్న పేషెంట్లకు అందిస్తున్నారు. ఆ థెరపీ సత్ఫలితాలను ఇస్తుండడంతో మరిన్ని రాష్ట్రాలకు ఐసీఎంఆర్ ప్లాస్మా థెరపీకి అనుమతులు ఇస్తోంది..!