దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలించడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం మద్యం విక్రయిస్తున్నారు. అయితే అనేక చోట్ల భౌతిక దూరం పాటించడం లేదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని.. కనుక మద్యం షాపులను మూసివేయాలని కోరుతూ ఓ పిటిషనర్ తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఆ పిటిషన్‌ను విచారించి.. దాన్ని కొట్టి పారేసింది. ఇక మద్యం అమ్మకాల విషయంలో కోర్టు రాష్ట్రాలకు పలు సూచనలు కూడా చేసింది.
కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రాలు మద్యాన్ని హోం డెలివరీ చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. ఆంక్షల సడలింపుల నేపథ్యంలో కొనసాగుతున్న మద్యం విక్రయాల వల్ల కరోనా వస్తుందనే విషయంపై ఓ వ్యక్తి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి పారేసింది. దీనిపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు అశోక్ భూషణ్, సంజయ్ కిషన్ కౌల్, బీఆర్ గవైలతో కూడిన ముగ్గురు సభ్యులు ఉన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది.
మద్యం అమ్మకాలపై రాష్ట్రాలదే నిర్ణయమని, అయితే కరోనా రాకుండా ఉండాలంటే.. మద్యాన్ని హోం డెలివరీ చేయాలని కోర్టు సూచించింది. కాగా ఈ విషయంపై కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సూచనలు చేయాలని పిటిషనర్ వాదించినా.. కోర్టు పట్టించుకోలేదు. ప్రస్తుతానికి దేశంలో మద్యాన్ని హోం డెలివరీ చేసే విధానంపై ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. అందువల్ల ఈ అంశం కేంద్రం పరిధిలోనే ఉంది. ఇక కేంద్రం త్వరలోనే ఆ మార్గదర్శకాలను రూపొందిస్తే.. రాష్ట్రాలు ఆన్‌లైన్‌లో మద్యాన్ని విక్రయించేందుకు అవకాశం ఉంటుంది.