సంప్రదాయ పంటలకు అలవాటు పడిన రైతులు ఏటా దిగుబడి, పెట్టుబడి కష్టాలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పామాయిల్ పంటకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల ప్రధానమంత్రి ఇక్రిసాట్ కు వచ్చినప్పుడు కూడా… పామాయిల్ పంట గురించి ప్రస్తావించారు. తెలంగాణకు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉందని అన్నారు.
దేశంలో సుమారు 22 మిలియన్ టన్నుల అవసరంగా కాగా… కేవలం 7 టన్నుల వంట నూనెలను మాత్రమే ఇండియా ఉత్పత్తి చేస్తోంది. దీంతో ఆయిల్ ధరలు ఏటేటా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఇండియా ఎక్కువగా పామాయిల్ ను మలేషియా, ఫిలిఫ్పీన్స్, ఇండోనేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఏటా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేయాల్సి వస్తోంది.
ఒక్క సారి వేస్తే.. 40 ఏళ్ల వరకు ఆదాయం:
పామాయిల్ పంటకు ఒకసారి పంట వేస్తే దాదాపు 40 ఏళ్ల వరకు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు. మార్కెటింగ్ సమస్య కూడా ఈ పంటకు లేకపోవడం రైతులకు మేలు చేస్తుంది. దీంతో పాటు ధరలో స్థిరత్వం ఉండటం కూడా ఆయిల్ పామ్ పంటకు కలిసి వచ్చే అంశం. ఒకప్పుడు కోస్తా జిల్లాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోనే సాగులో ఉండే పంట.. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సాగుకు ప్రోత్సహిస్తున్నారు. పలు జిల్లాల్లో ఆయిల్ తీసే పరిశ్రమలకు కూడా అనుమతులు వచ్చాయి.
ఏ నేలలు అనుకూలం..?
గాలిలో తేమ.. ఎక్కవగా నీటి సదుపాయం ఉన్న నీటి సదుపాయంతో పాటు.. ఎర్రనేలలు, నీరు నిలవని నల్లరేగడి నేతల్లో ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. రోజుకు ఒక్కో మొక్కకు వందల లీటర్ల నీరు అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నీటి సదుపాయం ఉండాలి. దీంతో పాటు డ్రిప్ సదుపాయం కూడా తప్పకుండా ఉండాలి. ముఖ్యంగా ఒక సంవత్సరం వయసు ఉన్న మొక్కను నాటుకోవాలి. పొలంలో త్రికోణాకారంలో నాటుకోవాలి. ఎటూ చూసినా…9 మీటర్ల దూరం ఉండేలా మొక్కలను నాటు కోవాలి. మొదటి మూడు ఏళ్లు పంట నుంచి ఎలాంటి దిగుబడి రాదు. దీంతో ఈ మూడేళ్లు అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.
ప్రభుత్వాల ప్రోత్సాహం..
తెలంగాణతో పాటు దేశంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ కు కూడా సబ్సిడీలు అందిస్తోంది. పామాయిల్ సాగు చేస్తే మూడేళ్ల దాకా రైతులకు ఆదాయం రాదు. మూడేళ్ల తరువతే పంట రావడం ప్రారంభం అవుతుంది. ఈ మూడేళ్ల కాలానికి ప్రభుత్వం, హర్టీకల్చర్ డిపార్ట్ మెంట్ తో పాటు ఈజీఎస్ స్కీమ్ ద్వారా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. మొక్కల మెయింటనెన్స్ కు, ఎరువులకు ఖర్చుకు ప్రభుత్వము ఏటా డబ్బులు ఇస్తోంది. దీంతో రైతులు నష్టపోకుండా.. పెట్టుబడి ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఉండే అవకాశం ఉంది. ఈ సబ్సిడీలు అన్నీ కలుపుకుంటే.. ఎకరాకు దాదాపుగా 6వేల- 10 వేల వరకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి…
తెలంగాణ వ్యాప్తంగా పామాయిల్ పంట సాగుకు ఆసక్తి కనబరుస్తున్నారు. తొలుత ఫైలెట్ ప్రాజెక్ట్ గా మంచిర్యాల, సిద్దిపేట, భూపాలపల్లి వంటి జిల్లాల్లో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం అన్ని జిల్లాల్లో పామాయిల్ సాగును ప్రొత్సహిస్తున్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో పామాయిల్ కంపెనీని కేటాయించారు. సదరు కంపెనీ వారు.. సాగును ప్రోత్సహించేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.