గాల్లో ఆలూ సాగు.. దిగుబడి సంప్రదాయపద్దతితో పోలిస్తే.. ఏడు రెట్లు అధికం

-

ఎక్కడ పండివి అక్కడ పిండిస్తే కిక్కేముంది. భూమిలో కాచే వాటిని గాల్లో పండిస్తేనే కదా మజా అనుకున్నాడేమో ఆయన.. బంగాళదుంపను గాల్లో పండిస్తున్నాడు ఈ హార్టకల్చరిస్ట్. హరియాణా, కర్నాలా జిల్లాకి చెందిన శ్యామ్‌గఢ్‌లోని పొటాటో టెక్నాలజీ సెంటర్‌, సిమ్లాలోని కేంద్ర ఆలూ పరిశోధనా సంస్థతో కలిసి బంగాళాదుంపల్ని గాల్లోనే పండిస్తోంది.
అసలు గాల్లో ఎలా పండిస్తారా అనేది మీ ప్రశ్న కదా.. గాల్లో పండించడానకి నేల, నీరు కూడా పెద్దగా అవసరం ఉండదు. కావాల్సిందల్లా.. ప్రత్యేక చాంబర్లు. నేలలో పండించే బంగాళాదుంపలతో పోలిస్తే ఈ కొత్త విధానంలో పది రెట్లు పంట ఎక్కువగా పండించవచ్చు. తెగుళ్లు వచ్చే అవకాశం చాలా తక్కువ అంటున్నారు పొటాటో సెంటర్‌కు చెందిన నిపుణులు.
ఈ విధానాన్ని సిమ్లాలోని ఐసిఎఆర్‌కు చెందిన సెంట్రల్‌ పొటాటో రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గతంలోనే రూపొందించింది. తాజాగా కర్నాలా సెంటర్‌లో దీన్ని పండించడంతో హరియాణాకి చెందిన కొందరు రైతులు ఈ ఏరోపోనిక్స్‌ పద్ధతిలో సాగును మొదలుపెట్టారు.
గాల్లో ఆలూనే ఎందుకు పండిస్తున్నారు..?
గోధుమ, వరి తరవాత ప్రపంచవ్యాప్తంగా పిండిపదార్థాల కోసం ఎక్కువమంది తినేది బంగాళాదుంపల్నే. అయితే నేలలో పండించే విత్తనాలకు తెగుళ్లు ఎక్కువగా రావడంతో రైతులకు మంచి విత్తనాలు దొరకడం కష్టమవుతుంది.. దాంతో నాసిరకం విత్తనాలతోనే పంట వేస్తున్నారు.
 ఏరోపోనిక్స్‌ ఎలా చేస్తారు..
గాల్లో సాగు పద్ధతిలో మట్టి అస్సలు అవసరం లేదు. నీటిని కూడా తుంపర రూపంలోనే వేళ్లకు అందిస్తారు. ఇందుకోసం నిర్మించిన ఛాంబర్లలో ఎత్తు ఎక్కువగా ఉండే బల్లలు ఒకదానిమీద ఒకటి ఉంటాయి. వాటిమీద ప్లాస్టిక్కు షీట్లలాంటివి పరిచి మధ్యలో రంధ్రాలు చేస్తారు. ఆ రంధ్రాల్లోంచి వేళ్లు చీకటిగా ఉండే టేబుల్‌ కింది భాగంలో వేలాడుతుంటాయి. టేబుల్‌కి పై భాగంలో మొక్క పెరగడానికి ఊతంగా సన్నని కర్రల్లాంటివి ఉంటాయి.
పోషకాలు కలిపిన నీటిని ఆ వేళ్లమీద చిలకరించేలా ట్యూబుల్ని ఏర్పాటు చేస్తారు. అందువల్లే ఈ తరహా మొక్కల పెంపకానికి నేలే కాదు, నీరూ పెద్దగా అవసరం లేదు. పైగా గాల్లో వేలాడే వేళ్లకి గుత్తులు గుత్తులుగా దుంపలు వస్తుంటాయి. మొక్కలూ వేగంగా పెరుగుతాయి. తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడి పొందవచ్చు.
ఈ సాగులో ఇంకో విశేషం ఏంటంటే.. ఒక మొక్క నుంచి కనీసం ఏడు నుంచి పది సార్లు దిగుబడి పొందవచ్చు. సంప్రదాయ విధానంలో అయితే మొక్క మొత్తం పీకాల్సిందే. ‘ముఖ్యంగా రైతులు విత్తనాలకోసం వాడే దుంపల్లో నాణ్యత లోపించడం, వాటికి వైరస్‌, ఫంగస్‌, బ్యాక్టీరియా వంటివి చేరడం వల్ల పంట దిగుబడి తగ్గుతుంది. అదే ఏరోపోనిక్స్‌ పద్ధతిలో విత్తనాలకోసం దుంపల్ని పండిస్తే తెగుళ్లు తక్కువ. పైగా ఏడాది పొడవునా పండించుకోవచ్చంటున్నారు ఈ నిపుణులు.
అమెరికాలోనూ ఈ విధానంలో ఆలూ పండిస్తున్నారు. అయితే సౌరవిద్యుత్తు మాదిరిగానే ఏరోపోనిక్స్‌ సాగు ఏర్పాట్లకోసం ముందు ఎక్కువ ఖర్చయినప్పటికీ దీర్ఘకాలంలో ఫలితం బాగుంటుందట.. ఈ పద్ధతిలో టొమాటో, స్ట్రాబెర్రీ, వంకాయ, పచ్చిమిర్చి, పాలకూర… వంటివీ పండించవచ్చట. ఇది తొలిదశలో ఉంది.. ముందు ముందు కొన్నేళ్లకు.. అన్నీ పంటలు ఇలానే గాల్లో వేలాడతాయేమో కదా..!

Read more RELATED
Recommended to you

Latest news