Business Ideas : యూట్యూబ్ చాన‌ల్‌ ఎలా పెట్టాలి..? ఎంత సంపాదన..?

-

ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో డ‌బ్బు సంపాదించే మార్గాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో యూట్యూబ్ చాన‌ల్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌డం కూడా ఒక‌టి. చెప్పుకునేందుకు కొంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. అయితే ఏ ప‌నిలో అయినా శ్ర‌మ ప‌డాల్సిందే. యూట్యూబ్ చాన‌ల్ పెట్టేందుకు కొంత టెక్నిక‌ల్ నాలెడ్జ్ అవ‌స‌రం. కంప్యూట‌ర్‌, ఇంట‌ర్నెట్‌, సోష‌ల్ మీడియాపై ప‌ట్టు ఉండాలి. అలాగే సింపుల్ వీడియో ఎడిటింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. దీనికి తోడు ఓపిక ఉండాలి. ఈ క్ర‌మంలో నిదానంగా అయినా స‌రే.. యూట్యూబ్ చాన‌ల్ ద్వారా సుదీర్ఘ కాలంలో చ‌క్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. అయితే యూట్యూబ్ చాన‌ల్ ఎలా పెట్టాలి..? దానికి ఎంత వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది..? ఎంత వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది..? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

యూట్యూబ్ చాన‌ల్ పెట్టేందుకు ఒక్క జీమెయిల్ అకౌంట్ ఉంటే చాలు. దాంతో యూట్యూబ్‌లోకి లాగిన్ అయి కొత్త‌గా చాన‌ల్ క్రియేట్ చేయ‌వ‌చ్చు. అయితే మీరు పెడుతున్న చాన‌ల్‌లో ఏ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు పెట్ట‌ద‌ల‌చుకున్నారో ముందుగానే అవ‌గాహ‌న ఉండాలి. అంటే.. ఉదాహ‌ర‌ణ‌కు.. మీకు వంట చేయ‌డం బాగా వ‌చ్చ‌నుకుంటే.. ప‌లు ర‌కాల వంట‌ల‌ను చేస్తూ.. వాటిని వీడియో తీసి.. ఆయా వంట‌లు ఎలా చేయాలో వీడియోల్లో చెబుతూ.. ఆ వీడియోల‌ను యూట్యూబ్ చానల్‌లో అప్‌లోడ్ చేయాలి. అలాగ‌న్న‌మాట‌.. ఇక మీరు గేమింగ్ ప్రియులు అయితే.. ర‌క ర‌కాల గేమ్స్ ఆడుతూ వాటి వీడియోలు రికార్డ్ చేసి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. ఇలా ర‌క ర‌కాల అంశాల‌కు సంబంధించి మీకున్న ప‌రిజ్ఞానం మేర వీడియోలు క్రియేట్ చేసి లేదా రికార్డు చేసి వాటిని యూట్యూబ్‌లో పెట్టి త‌ద్వారా వాటితో డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు.

అయితే మీరు పెట్టిన యూట్యూబ్ చాన‌ల్‌లో ఉండే కంటెంట్‌కు సంబంధించి వీడియోల‌కు గాను త‌గిన విధంగా టైటిల్స్‌, డిస్క్రిప్ష‌న్‌, కీ ట్యాగ్స్ ఇవ్వాలి. దీంతో యూట్యూబ్‌లో ఎవ‌రైనా ఆ అంశాల‌కు సంబంధించిన వీడియోల‌ను సెర్చ్ చేసిన‌ప్పుడు మీ వీడియోలు సెర్చ్ లిస్ట్‌లో మొద‌టి పేజీల్లో క‌నిపించేందుకు ఎక్కువ అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా మీ వీడియోల‌కు ట్రాఫిక్ ఎక్కువ వ‌స్తుంది. ఇక షూట్ చేసిన వీడియోల‌ను ఎడిట్ చేసేందుకు పీసీలో, మొబైల్స్‌లో ప‌లు వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని యూజ‌ర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కొన్నింటిని లిమిటెడ్ ఫీచ‌ర్ల‌తో ఉచితంగా వాడుకునేందుకు అవ‌కాశం ఉంటుంది.

పీసీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ల‌లో.. అడోబ్ ప్రీమియ‌ర్ ప్రొ, ఆఫ్ట‌ర్ ఎఫెక్ట్స్‌, పినాకిల్ స్టూడియో, సైబ‌ర్‌లింక్ ప‌వ‌ర్ డైరెక్ట‌ర్‌, కామ్‌టేసియా స్టూడియో.. వంటివి అందుబాటులో ఉన్నాయి. అలాగే మాక్ పీసీకి అయితే ఫైన‌ల్ క‌ట్ ప్రొ అందుబాటులో ఉంటుంది. ఇక మొబైల్‌కు అయితే ఫిల్మోరా, అడోబ్ ప్రీమియ‌ర్ క్ల‌బ్‌, ప‌వ‌ర్ డైరెక్ట‌ర్ వంటి వీడియో ఎడిటింగ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇక యూట్యూబ్ చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసే వీడియోల‌ను రికార్డ్ చేసేందుకు చ‌క్క‌ని డీఎస్ఎల్ఆర్ కెమెరాను కొనుగోలు చేయ‌వ‌చ్చు. డ‌బ్బులు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. రూ.60వేలు మొద‌లుకొని ఆ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అదే అంత పెట్టుబ‌డి ముందుగా ఎందుకు.. అనుకుంటే.. చ‌క్క‌ని కెమెరా కెపాసిటీ క‌లిగిన ఫోన్ల‌తోనూ వీడియోల‌ను షూట్ చేసి వాటిని ఎడిట్ చేసి యూట్యూబ్ చాన‌ల్‌లోకి అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.

ఇక ఎడిట్ చేసిన వీడియోల‌కు స‌ద‌రు సాఫ్ట్‌వేర్ల స‌హాయంతోనే మ్యూజిక్ యాడ్ చేయ‌వ‌చ్చు. అయితే అది కాపీ రైట్ మ్యూజిక్ అయి ఉండ‌కూడ‌దు. ఉచితంగా వాడుకునే మ్యూజిక్ అయి ఉండాలి. అలాంటి మ్యూజిక్ మీ వ‌ద్ద ఉంటే దాన్ని వీడియోల‌కు యాడ్ చేయ‌వ‌చ్చు. ఈ విష‌యంలో గూగుల్ త‌న యూట్యూబ్ స్టూడియోలో ఉచితంగా వాడుకునేందుకు ప‌లు మ్యూజిక్ ట్రాక్‌ల‌ను కూడా అందుబాటులో ఉంచింది. వాటిని యూజ‌ర్లు త‌మ వీడియోల‌కు యాడ్ చేసుకుని ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక మ్యూజిక్ లేకుండా వాయిస్ ఓవ‌ర్ అయితే అందుకు నాణ్య‌మైన హెడ్‌ఫోన్స్‌ను (మైక్ ఉన్న‌వి) కొనాలి. వాటితో మీ వాయిస్ ఓవ‌ర్‌ను రికార్డు చేసి దాన్ని ఆ వీడియోల‌కు ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా యాడ్ చేయ‌వ‌చ్చు.

అలా ఎడిటింగ్ పూర్త‌యిన వీడియోల‌ను నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు. అయితే వాటికి థంబ్ నెయిల్స్ ఇచ్చేందుకు గాను ఫొటోషాప్‌లో చ‌క్క‌ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. అందుకు ఫొటోషాప్ నేర్చుకోవాలి. అదేం అవ‌స‌రం లేద‌నుకుంటే.. ఆ వీడియోల‌ను నేరుగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు.. వాటికి గాను థంబ్ నెయిల్స్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతాయి. వాటిలో ఏదైనా ఒక దాన్ని థంబ్ నెయిల్‌గా ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇలా వీడియోల‌ను విజ‌య‌వంతంగా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌వ‌చ్చు.

అయితే వీడియోల‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే ఆదాయం ఎలా వ‌స్తుంది..? అని కొంద‌రు ఆలోచిస్తారు. అది ఎలాగంటే.. యూట్యూబ్ త‌న యూజ‌ర్లు పెట్టే వీడియోల ద్వారా వ‌చ్చే ఆదాయంలో 55 శాతం షేర్‌ను యూజ‌ర్‌కు ఇస్తుంది. అంటే యూజ‌ర్ పెట్టిన ఒక వీడియో ద్వారా 1 రూపాయి ఆదాయం వచ్చింద‌నుకుంటే.. అందులో 55 పైస‌ల‌ను యూజ‌ర్‌కు వీడియో పెట్టినందుకు ఇస్తుంద‌న్న‌మాట‌. ఇక సాధార‌ణంగా యూట్యూబ్‌లో యూజ‌ర్లు పెట్టిన వీడియోల‌కు గాను ప్ర‌తి 1000 వ్యూస్‌కు 1 నుంచి 6 డాల‌ర్ల వ‌ర‌కు ఆదాయం వ‌స్తుంది. ఇది అనేక అంశాల‌పై ఆధార ప‌డి ఉంటుంది. వీడియోల‌ను చూసే వ్యూయ‌ర్లు ఉన్న ప్ర‌దేశం, అడ్వ‌ర్ట‌యిజ‌ర్ల ఆస‌క్తి, వారు యాడ్స్ ఇచ్చే రేటు త‌దిత‌ర అంశాల ఆధారంగా ఆ ఆదాయం వ‌స్తుంది. అది ఒక్కోసారి 1 డాల‌ర్ క‌న్నా త‌క్కువ‌గా కూడా ఉండ‌వ‌చ్చు. కానీ వారు ఇచ్చే యాడ్స్‌ను బ‌ట్టి, యూజ‌ర్ల వీడియోల‌కు వ‌చ్చే వ్యూస్‌ను బ‌ట్టి వారికి ఆ వీడియోల ద్వారా వ‌చ్చే ఆదాయం మారుతుంది.

యూట్యూబ్‌లో వీడియోలు పెట్టి వాటిని వ్యూయ‌ర్స్ వీక్షిస్తారులే అని ఎదురు చూడ‌కూడ‌దు. యూట్యూబ్ చాన‌ల్ కొత్త‌గా పెట్టిన వారు దాని గురించి ప‌బ్లిసిటీ చేయాలి. ఫేస్‌బుక్‌, గూగుల్ త‌దిత‌ర అనేక ప్లాట్‌ఫాంల‌పై అవ‌స‌రం అయితే కొంత డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టి యూట్యూబ్ చాన‌ల్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్ల‌ను పెంచుకోవ‌చ్చు. అలా 1వేయి స‌బ్‌స్క్రైబ‌ర్లు అయితే యూట్యూబ్ ఆ యూజ‌ర్‌కు గూగుల్‌ యాడ్‌సెన్స్ అకౌంట్‌ను ఇస్తుంది. ఇక‌ అప్ప‌టి నుంచి యూట్యూబ్‌లో యూజ‌ర్లు పెట్టే వీడియోల‌కు యాడ్స్‌ను బ‌ట్టి ఆదాయం వ‌స్తుంటుంది. ఇక వీడియోల‌ను చూసే వారి నుంచి డొనేష‌న్ల‌ను స్వీక‌రించ‌డం కోసం సూప‌ర్ చాట్ కూడా ఎనేబుల్ అవుతుంది. అందుకు కూడా యూట్యూబ్ చాన‌ల్ స‌బ్‌స్క్రైబ‌ర్ల సంఖ్య 1000 దాటాలి.

యూట్యూబ్ చాన‌ల్ పాపుల‌ర్ అయ్యే కొద్దీ అందులో ఉన్న వీడియోల‌కు వ‌చ్చే రెవెన్యూ కూడా పెరుగుతుంది. చాన‌ల్ పాపుల‌ర్ అవుతుంది కాబ‌ట్టి అడ్వ‌ర్ట‌యిజ‌ర్లు ఆ చాన‌ల్‌లో పెట్టే వీడియోల‌కు యాడ్స్ ఇచ్చేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తారు. దీంతో యాడ్ రేట్ ఎక్కువ‌వుతుంది. అలా వీడియోల‌కు ఎక్కువ రేటు చెల్లిస్తారు. దీంతో యూజర్ల‌కు అప్పుడు ఎక్కువ ఆదాయం వ‌స్తుంది. అలా చాన‌ల్‌కు స‌బ్‌స్క్రైబ‌ర్లు పెరుగుతూ.. పాపుల‌ర్ అయ్యేకొద్దీ.. దానికి వ‌చ్చే ఆదాయం కూడా గ‌ణ‌నీయంగా పెరుగుతుంది. అయితే ఈ తంతు అంతా జ‌రిగేందుకు స‌హ‌జంగానే చాలా ఎక్కువ కాలం ప‌డుతుంది. అయితే డ‌బ్బు పెట్టుబ‌డి పెట్టే సామ‌ర్థ్యం ఉంటే.. త‌క్కువ కాలంలోనే యూట్యూబ్ చాన‌ల్ ద్వారా ఎక్కువ మొత్తంలో డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు.

ఇక యూట్యూబ్ చాన‌ల్‌లో వీడియోల‌కు గూగుల్ ఇచ్చే యాడ్స్ మాత్ర‌మే కాకుండా యూజ‌ర్ త‌న పాపులారిటీని బ‌ట్టి త‌న‌కు తెలిసిన కంపెనీల‌తో టై అప్ అయ్యి.. వారి కంపెనీకి చెందిన ప్రొడ‌క్ట్స్‌, సేవ‌ల‌ను ప్ర‌మోట్ చేస్తూ త‌మ వీడియోల‌లో స్పాన్స‌ర్‌షిప్ లింక్‌లు, యాడ్ లింక్‌లు పెట్ట‌వ‌చ్చు. వారి ప్రొడ‌క్ట్స్‌ను ప్ర‌మోట్ చేయ‌వ‌చ్చు. ఇలా కూడా యూజ‌ర్లు త‌మ యూట్యూబ్ చాన‌ల్ ద్వారా డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు. అలాగే ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌కు చెందిన వెబ్‌సైట్ల‌లో ఉండే ప్రొడ‌క్ట్స్‌ను చాన‌ల్ ద్వారా అమ్ముతూ.. అఫిలియేట్ విధానంలో ఆ అమ్మ‌కాల‌కు క‌మిష‌న్లు కూడా పొంద‌వ‌చ్చు. చాన‌ల్‌లోని వీడియోల కింద డిస్క్రిప్ష‌న్‌లో స‌ద‌రు ప్రొడ‌క్ట్స్‌కు చెందిన సేల్స్ లింక్‌ల‌ను ఇవ్వ‌డం ద్వారా వ్యూయ‌ర్లు నేరుగా అక్క‌డి నుంచే త‌మ‌కు కావ‌ల్సిన ప్రొడ‌క్ట్స్‌ను కొనుగోలు చేసేలా స‌దుపాయం క‌ల్పించ‌వ‌చ్చు. దీంతో వారు కొనుగోలు చేసే వ‌స్తువుల‌ను బ‌ట్టి.. ఒక్కో కొనుగోలుపై నిర్దిష్ట‌మైన మొత్తంలో క‌మిష‌న్ పొంద‌వ‌చ్చు. ఆ మొత్తాన్ని ఈ-కామ‌ర్స్ వెబ్‌సైట్లు మీకు పేమెంట్ కింద చెల్లిస్తాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ త‌దిత‌ర వెబ్‌సైట్లు ఇలా అఫిలియేట్ ప‌ద్ధ‌తిలో క‌మిష‌న్లు పొందే అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి.

earn good income with your own youtube channel

అయితే యూట్యూబ్ చాన‌ల్‌లో అప్‌లోడ్ చేసే ఏ వీడియో అయినా స‌రే.. కనీసం 30 సెక‌న్ల నిడివి ఉండేలా చూసుకోవాలి. అప్పుడే దానికి యాడ్స్ వ‌స్తాయి. అలాగే వీడియోల‌ను అప్‌లోడ్ చేస్తున్నాం క‌దా.. వ్యూస్ రావ‌డం లేదేంటి..? అని కంగారు ప‌డాల్సిన ప‌నిలేదు. ఆరంభంలో అలాగే ఉంటుంది. కానీ ఆ వీడియోలు పాపుల‌ర్ అయితే.. అప్పుడు మీరు వ‌ద్ద‌న్నా వాటికి ఎడా పెడా వ్యూస్ వ‌స్తుంటాయి. అలా వ్యూస్ వ‌చ్చేలా చేసుకోవాల్సిన టెక్నిక్ అంతా మీ వ‌ద్దే ఉంటుంది. మీరు ఎంత చ‌క్కటి కంటెంట్‌తో వీడియోల‌ను యూట్యూబ్ చాన‌ల్‌లో పెడితే.. అంత ఎక్కువ‌గా వ్యూస్ వ‌చ్చి.. మీ చాన‌ల్ అంత పాపుల‌ర్ అవుతుంది. అందుకు ఎవ‌రైనా స‌రే.. కొంచెం శ్ర‌మించాల్సిందే.. అవును.. క‌ష్ట‌ప‌డ‌కపోతే మ‌నం మ‌న ల‌క్ష్యాన్ని చేరుకోలేం క‌దా.. ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌నుకునేవారు, అందులోనూ యూట్యూబ్ చాన‌ల్‌నే స్వ‌యం ఉపాధిగా మార్చుకోవాల‌నుకునే వారు.. ప‌ట్టుద‌ల‌తో శ్ర‌మిస్తే.. కొంత స‌మ‌యం ప‌ట్టినా.. విజ‌యం త‌ప్ప‌క వ‌రిస్తుంది. మ‌రింకెందుకాల‌స్యం.. వినూత్న రీతిలో.. మీదైన శైలిలో వీడియోల‌ను క్రియేట్ చేసి పెట్టే స‌త్తా మీలో ఉంటే.. వెంట‌నే సొంతంగా యూట్యూబ్ చాన‌ల్ ప్రారంభించండి మ‌రి..! మరిన్ని బిజినెస్‌ ఐడియాస్‌ కోసం మనలోకం.కామ్‌ ని ఫాలో అవ్వండి.. మీ మీ మిత్రులతో షేర్‌ చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news