Business Ideas : ఇంట్లోనే పెన్నుల‌ను త‌యారు చేసి అమ్మండి.. లాభాలు సంపాదించండి..!

కేవ‌లం విద్యార్థుల‌కే కాదు, చాలా మందికి పెన్నులు అవ‌స‌రం ఉంటాయి. పెన్నుల అవ‌స‌రం లేని వారంటూ ఉండ‌రు. ప్ర‌తి ఒక్క‌రూ వాటితో ఏదో ఒక‌టి రాసుకుంటారు. క‌నుక పెన్నుల‌ను అంద‌రూ వాడుతారు. అయితే వాటిని ఇంటిలోనే త‌యారు చేసి అమ్మ‌వ‌చ్చు. దాంతో చక్క‌ని ఆదాయం సంపాదించ‌వ‌చ్చు. మ‌రి ఈ బిజినెస్ ఎలా చేయాలో.. అందుకు ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుందో.. ఎంత ఆదాయం వ‌స్తుందో.. ఆ వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..!

make pens at home and earn good income

పెన్నుల‌ను త‌యారు చేసేందుకు 5 ర‌కాల మెషిన్లు అవ‌స‌రం అవుతాయి. వాటికి దాదాపుగా రూ.20వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. వీటితో నిత్యం 2వేల పెన్నులు త‌యారు చేయ‌వ‌చ్చు. పెన్నుల‌కు ముందుగా కింది భాగంలో నీడిల్ చుట్టూ ఉండే అడాప్ట‌ర్‌ను మెషిన్ స‌హాయంలో ఫిక్స్ చేయాలి. అనంత‌రం పెన్నులో మ‌రొక మెషిన్‌తో ఇంక్ నింపాలి. త‌రువాత నీడిల్‌ను అమ‌ర్చాలి. ఇందుకు ఇంకో మెషిన్ ఉంటుంది. త‌రువాత సెంట్రిఫ్యూజ్ మెషిన్ స‌హాయంతో పెన్నుల‌ను మెషిన్‌లో వేసి వాటిని తిప్పాలి. దీంతో పెన్నుల్లో నింప‌బ‌డిన ఇంక్ స‌మానంగా అందులో విస్త‌రిస్తుంది. ఇంక్ మ‌ధ్య‌లో ఖాళీలు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

ఇక త‌యారైన పెన్నుల‌పై ప్రింటింగ్ మెషిన్‌తో మ‌న కంపెనీ పేరు ప్రింట్ చేసుకోవ‌చ్చు. అయితే పెన్నుల‌ను త‌యారు చేయాలంటే కావ‌ల్సిన ఇంక్ ఖ‌రీదు కేజీకి రూ.300 వ‌ర‌కు ఉంటుంది. 1 కేజీ ఇంక్ 2800 పెన్నుల త‌యారీకి స‌రిపోతుంది. 1కేజీ పెన్ను బ్యారెల్స్‌కు రూ.130 అవుతుంది. ఇందులో 250 పీసులు వస్తాయి. 1000 పీసుల పెన్ టిప్స్‌కు రూ.150 అవుతుంది. 1000 పీసుల అడాప్ట‌ర్స్‌కు రూ.28 అవుతుంది. అలాగే 1000 పీసుల క్యాప్స్‌కు రూ.150 అవుతుంది. ఇక వీట‌న్నింటితో ఒక పెన్నును త‌యారు చేసేందుకు 95 పైస‌లు ఖ‌ర్చ‌వుతాయి. అంటే ఒక పెన్ను త‌యారీకి దాదాపుగా రూ.1 ఖ‌ర్చ‌వుతుంది.

అయితే హోల్‌సేల్ మార్కెట్‌లో ఒక పెన్నును రూ.1.60 నుంచి రూ.1.80 కు విక్ర‌యించ‌వ‌చ్చు. పెన్నును రూ.1.60కు అమ్మితే.. అందులో రూ.1 ఖ‌ర్చు పోను.. 60 పైస‌లు లాభం ఉంటుంది. ఈ క్ర‌మంలో నిత్యం 1వేయి పెన్నుల‌ను త‌యారు చేసి అమ్మినా 1000 * 0.60 = రూ.600 వ‌స్తాయి. అదే నెల‌కు అయితే రూ.18వేలు వ‌స్తాయి. ఇలా పెన్నుల‌ను ఇంట్లోనే త‌యారు చేసి అమ్ముతూ లాభాల‌ను సంపాదించ‌వ‌చ్చు.