బిజినెస్‌ ఐడియా.. ల్యాప్‌టాప్‌, మొబైల్‌ రిపేరింగ్‌ షాప్‌.. తక్కువ పెట్టుబడితో మొదలెట్టొచ్చు..!

-

తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్‌ ఐడియా వైపు ఓ లుక్కేయండి. మొబైల్-ల్యాప్‌టాప్ రిపేర్ సెంటర్ వ్యాపారాన్ని ప్రారంభించండి. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ల వాడకం నేడు ఎంత విపరీతంగా పెరిగిందో మనందరికీ తెలిసిన విషయమే.. వినియోగం పెరిగిందంటే.. వాటి తాలూకూ అమ్మకాలు, అవి పాడైతే రిపేర్‌ చేసే షాపులు కూడా పెరుగుతాయి. ఇలాంటి రంగంలో మీరు బిజినెస్‌ చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందొంచు.

ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.. మీరు వాటి గురించిన మొత్తం సమాచారాన్ని కలిగి ఉండాలి. అందుకే మీరు ముందుగా ల్యాప్‌టాప్, మొబైల్ రిపేరింగ్‌లో కోర్సు చేయడం ముఖ్యం. దేశంలోని అనేక ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సును అందిస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా బోలెడు ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. అంతే కాకుండా ల్యాప్‌టాప్, మొబైల్ రిపేరింగ్‌ను ఆన్‌లైన్‌లో నేర్చుకునే అవకాశం కూడా ఉంది.

ఇలా ప్రారంభించండి:

మీరు ల్యాప్‌టాప్, మొబైల్ రిపేరింగ్‌లో ప్రావీణ్యం సంపాదించిన తర్వాత మీరు మీ రిపేరింగ్ కేంద్రాన్ని ప్రారంభించండి. మీకు మంచి అనుభవం రావాలంటే ముందుగా రిపేరింగ్ కేంద్రంలో పని చేయడం కూడా మంచి పద్దతే… ల్యాప్‌టాప్ రిపేరింగ్ కేంద్రాలను ప్రజలు సులభంగా చేరుకోగలిగే ప్రదేశంలో పెట్టాలి.. కాస్త రెంట్‌ ఎక్కువైనా పర్వాలేదు..రద్దీగా ఉండే ఏరియాలోనే మన బిజినెస్‌ ఉండాలి. ఇప్పటికే ఎక్కువ కంప్యూటర్ రిపేరింగ్ కేంద్రాలు అక్కడ ఉండకూడదు. మీ కేంద్రాన్ని ప్రచారం చేయడానికి మీరు సోషల్ మీడియా సహాయం తీసుకోవచ్చు.

ల్యాప్‌టాప్, మొబైల్ రిపేరింగ్ కేంద్రాన్ని ప్రారంభించడానికి ముందు అవసరమైన పరికరాలను మీ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఆ జాబితా తయారు చేసుకుని కొనుగోలు చేయాలి. రిపేర్ చేసే సమయంలో మార్చాల్సిన పరికరాలను ఉదాహరణకు స్పీకర్లు, స్క్రీన్ లాంటి వాటిని ఆర్డర్ ఇచ్చి అప్పటికప్పుడు తెప్పించుకోవచ్చు. అవసరం లేనివి ఒకేసారి తెచ్చిపెట్టుకోవద్దు.

ఖర్చులు – ఆదాయం:

కంప్యూటర్ రిపేరింగ్ కేంద్రాన్ని రూ. 2 నుంచి 4 లక్షలతో ప్రారంభించవచ్చు. ప్రారంభంలో చిన్న వస్తువులను ఉంచడం ద్వారా పని చేయవచ్చు. పని పెరిగే కొద్దీ పెట్టుబడి కూడా పెరగుతుంది.. మరమ్మతు చేయడమే కాకుండా, తర్వాత మీరు ల్యాప్‌టాప్‌లు,మొబైల్‌లను విక్రయించడం కూడా ప్రారంభించవచ్చు. మొబైల్, ల్యాప్‌టాప్ రిపేరింగ్ ఫీజు చాలా ఎక్కువగా ఉంటుంది.. కాబట్టి మీరు ఈ వ్యాపారం చేస్తే మంచి డబ్బు సంపాదించవచ్చు. అయితే పుస్తకాల మీద రాసుకున్నంత సులభంగా జీవితం ఉండదు.. కాబట్టి బాగా ఆలోచించి చేయగలం, నిలబడగలం అనే ధైర్యం ఉంటేనే దిగాలి.!

Read more RELATED
Recommended to you

Exit mobile version