గోధుమగడ్డి జ్యూస్‌ను నిత్యం తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీని వల్ల రక్తం బాగా తయారవుతుంది. దీంట్లో ఉండే ఫైబర్ జీర్ణసమస్యలను పోగొట్టి, అధిక బరువు తగ్గేలా చేస్తుంది. శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తుంది. అయితే చాలా మందికి గోధుమ గడ్డి జ్యూస్ అందుబాటులో ఉండదు. కానీ గోధుమ గడ్డి పొడి మాత్రం దొరుకుతుంది. అందువల్ల దీన్ని తయారు చేసి విక్రయిస్తే.. చక్కని ఆదాయం పొందవచ్చు. మరి గోధుమ గడ్డి పౌడర్‌ను ఎలా తయారు చేయాలో.. ఆ బిజినెస్‌లో ఏ మేర సంపాదించవచ్చో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
గోధుమగడ్డి పౌడర్‌ను తయారు చేయాలంటే.. ముందుగా గోధుమగడ్డిని పెంచాలి. దీన్ని ఇంట్లో కుండీల్లో పెంచాల్సి ఉంటుంది. లేదా ప్లాస్టిక్ ట్రేలలో మట్టి పోసి వాటిలో కూడా గోధుమ గడ్డిని పెంచవచ్చు. ముందుగా గోధుమలను నీటిలో బాగా కడిగి శుభ్రం చేసి.. వాటిని నానబెట్టాలి. అనంతరం 8 గంటలు అయ్యాక.. వాటిని తీసి ఓ కాటన్ గుడ్డలో చుట్టాలి. దీంతో 1, 2 రోజుల్లో అవి మొలకలుగా వస్తాయి. వాటిని తీసి కుండీల్లో, లేదా ట్రేలలో మట్టిలో చల్లాలి. దీంతో అవి మొక్కలుగా మొలకెత్తుతాయి. ఈ క్రమంలో 5 నుంచి 10 రోజుల్లో గోధుమ గడ్డి పెరుగుతుంది.
ఆ గడ్డి సుమారుగా 5 నుంచి 10 ఇంచుల పొడవు ఉంటుంది. దాన్ని కట్ చేయాలి. ఆ తరువాత గడ్డిని నీడలో ఆరబెట్టాలి. ఒక రోజు పాటు నీడలో ఆరాక ఆ గడ్డి డ్రై అవుతుంది. అనంతరం దాన్ని మిక్సీలో వేసి పొడిలా పట్టుకోవాలి. దీంతో గోధుమ గడ్డి పౌడర్ తయారవుతుంది. దాన్ని చిన్నపాటి జార్లు లేదా గాలి చొరబడని ఎయిర్‌టైట్ ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి విక్రయించవచ్చు. అయితే గోధుమగడ్డిని మొక్కల నుంచి ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటే.. మళ్లీ గడ్డి పెరుగుతుంటుంది. అలా కొన్ని పర్యాయాలు జరిగాక.. మొత్తం మట్టిని మార్చి.. మళ్లీ యథాప్రకారం గోధుమలతో మొలకలు తయారు చేసి తిరిగి గోధుమగడ్డిని పెంచాల్సి ఉంటుంది. దీంతో తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ లాభం పొందవచ్చు.
ఇక మార్కెట్‌లో గోధుమగడ్డి పౌడర్ 300 గ్రాముల జార్ ధర రూ.400 గా ఉంది. అంటే.. 1 కేజీకి దాదాపుగా రూ.1330 వరకు ధర ఉందన్నమాట. అయితే అందులో రూ.400 వరకు ఖర్చులు, మరో రూ.200 రిటెయిలర్ మార్జిన్.. మొత్తం కలిపి రూ.600 తీసేస్తే.. దాదాపుగా రూ.730 అవుతుంది. ఇది మనకు 1 కేజీ గోధుమ గడ్డి పౌడర్‌ను అమ్మితే వచ్చే లాభం అన్నమాట. ఈ క్రమంలో నెలకు 50 కిలోల గోధుమ గడ్డి పౌడర్‌ను తయారు చేసినా.. 50 * 730 = రూ.36,500 సంపాదించవచ్చు. అదే స్థలం కాస్త ఎక్కువ ఉండి, నెలకు 100 కిలోల గోధుమ గడ్డి పౌడర్‌ను తయారు చేస్తే 100 * 730 = రూ.73వేలు అవుతుంది. ఇలా గోధుమ గడ్డి పౌడర్‌ను తయారు చేసి విక్రయిస్తే.. తక్కువ పెట్టుబడితోనే అధికంగా లాభాలు ఆర్జించవచ్చు.
అయితే ఈ పౌడర్‌ను ఎక్కువగా మెడికల్ షాపులు, కిరాణా స్టోర్స్, సూపర్‌మార్కెట్లలో కొంటారు. అందువల్ల ఆయా షాపుల వారితో టై అప్ అయి వారికి ఈ పౌడర్‌ను రెగ్యులర్‌గా సరఫరా చేస్తే.. చక్కని ఆదాయం పొందవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో మీరే సొంతంగా పౌడర్‌ను అమ్మితే.. రిటెయిలర్ మార్జిన్ కూడా తీసేయాల్సిన అవసరం లేదు. అదే మార్జిన్ మీ లాభాల్లో చేరుతుంది. దీంతో ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని ఈ బిజినెస్ ద్వారా సంపాదింవచ్చు..!