విశాల్ సినిమాకు బ్రేక్‌..షాకిచ్చిన మ‌ద్రాస్ కోర్టు‌!

త‌మిళ హీరో విశాల్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు. త‌న మాజీ మేనేజ‌ర్ కార‌ణంగా వార్త‌ల్లో నిలిచి సంచ‌ల‌నం సృష్టించిన విశాల్ తాజాగా `యాక్ష‌న్‌` మూవీ వివాదం ద్వారా మ‌రోసారి వార్త‌ల‌కెక్కారు. విశాల్ న‌టించి నిర్మించిన `చ‌క్ర‌` చిత్ర రిలీజ్‌ని ఆపేయాలంటూ ట్రిడెంట్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థ మ‌ద్రాసు హైకోర్టుని ఆశ్ర‌యించింది. త‌మ‌కు ఇవ్వాల్సిన మొత్తం చెల్లించ‌కుండా `చ‌క్ర‌` రిలీజ్‌కు అనుమ‌తివ్వ‌కూడ‌ద‌ని వాద‌న‌లు వినిపించింది.

దీంతో విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం విశాల్ న‌టించిన `చ‌క్ర‌` చిత్ర విడుద‌ల‌ని నిలిపివేయాలంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ట్రిడెంట్ ఆర్ట్స్ సంస్థ ఇటీవ‌ల విశాల్ హీరోగా `యాక్ష‌న్‌` చిత్రాన్ని నిర్మించింది. 44 కోట్ల బ‌డ్జెట్ అయింది. అయితే అనుకున్న స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. త‌మిళ‌నాడులో 7.7 కోట్లు, ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిరాశ‌ప‌రిచింది. దీంతో మేక‌ర్స్ 20 కోట్ల మేర న‌ష్ట‌పోయారు. ఆ న‌ష్టాన్ని పూడ్చ‌డానికి విశాల్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని ట్రిడెంట్ ఆర్ట్స్ కే చేస్తాన‌ని మాటిచ్చార‌ట‌.

అయితే ఆ మాట‌కు విరుద్ధంగా త‌న సొంత నిర్మాణ సంస్థ‌లోనే `చ‌క్ర‌` పేరుతో సైబ‌ర్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌ని చేశాడు విశాల్‌. ఈ మూవీని దీపావ‌ళికి ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ కూడా చేసుకున్నాడు. అయితే ఈ ఏర్పాట్ల‌ని గ‌మ‌నించిన ట్రిడెంట్ ఆర్ట్స్ `చ‌క్ర‌` విడుద‌ల‌ని నిలిపి వేయాల‌ని, తాము డిమాండ్ చేస్తున్న 8.29 కోట్ల‌ న‌ష్ట‌ప‌రిహారాన్ని తిరిగి చెల్లించే వ‌ర‌కు స్టే విధించాల‌ని కోర్డుకు విన్న‌వించ‌డంతో కోర్టు రిలీజ్‌పై స్టే విధించ‌డం సంచ‌ల‌నంగా మారింది.