తెర ఎత్తి.. 100 రోజులు.. ఇలా ఇంకెన్ని రోజులో..?!

-

క‌రోనా ఎఫెక్ట్‌.. వ్య‌క్తుల జీవితాను మార్చేసింది. దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ల‌నే కుప్ప‌కూ ల్చింది. అంతేకాదు, అన్ని రంగాల్లోనూ పెను మార్పులు చేసేసింది.  టైం షెడ్యూళ్ల‌ను ప‌క్క‌కు తోసేసింది. ఒక‌ప్పుడు టైం లేద‌న్న‌వారు.. ఇప్పుడు బోర్ కొట్టి భోరుమంటున్నారు. ఇలా క‌రోనా చేసిన అనేక మార్పులు మ‌న క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నాయి. ఇలాంటివాటిలో ఒక‌టి.. సినిమా హాళ్లు!  దేశ‌వ్యాప్తంగా సినిమాహాళ్ల‌కు తాళం ప‌డి వంద రోజులు పూర్త‌య్యాయి. గ‌తంలో నిత్యం నాలుగు షోల‌తో ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచిన సినిమాహాళ్లు డిజిట‌ల్ మాధ్య‌మంగా మారిన త‌ర్వాత‌.. ఒకే స్క్రీన్‌పై రోజుకు ఇర‌వై ఆట‌ల‌తోనూ అల‌రించాయి.

 

అలాంటి మూవీ హాళ్లు క‌రోనా నేప‌థ్యంలో మూత‌బ‌డ్డాయి. థియేటర్ల వద్ద  కొత్త సినిమాల విడుదల సందడి లేదు. అభిమాన సంఘాల హడావిడి అంతకంటే లేదు. విజయోత్సవ ర్యాలీలు లేవు. సినిమా హాళ్ల వద్ద హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించడం లేదు. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూతపడి నేటికి వంద రోజులు. నిత్యం ప్రేక్షకులు, అభిమాన సంఘాలతో కళకళలాడే థియేటర్లు వంద రోజులుగా వెలవెలబోతున్నాయి. ఏ థియేటర్‌ గేటు దగ్గర చూసిన కరోనా లాక్‌డౌన్‌ బోర్డులే దర్శనమిస్తున్నాయి. మూడు నెలలుగా సినిమా ప్రదర్శనలు నిలిచిపోవడం యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో పడిండి.

ఒక్కో థియేటర్‌ క్లాస్‌ను బట్టి వారానికి రూ.1 లక్షల నుంచి 3.50 లక్షల వరకు లీజు వస్తుంది. ప్రస్తుతం ప్రదర్శనలు లేకపోవడంతో యజమానులకు లీజు రావడం లేదు. ఒక్కో యజమాని నెలకు రూ. 4 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి తోడు థియేటర్ల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్‌ చార్జీల రూపంలో అదనపు భారం పడింది.. కొన్ని థియేటర్ల యాజమాన్యం 50 శాతం సిబ్బందిని తప్పించి వారికి నిత్యావసరాలు, వారానికి కొంత మొత్తం నగదు చెల్లిస్తున్నారు. ఇదిలావుంటే.. స‌గ‌టు ప్రేక్ష‌కుడు కూడా వినోదానికి దూర‌మై..(ఎంత‌గా టీవీలు ఉన్నా.. ఫోన్లున్నా.. సినిమా మాధ్యమం ఒత్తిడిని దూరం చేస్తుంద‌ని నిరూప‌ణ అయింది) ఒత్తిడి చేరువ‌వుతున్నాడు.

అయితే, క‌రోనా విష‌యంలో సాధార‌ణ జ‌న‌జీవ‌నంపై ప్ర‌భుత్వాలు కొంత మేర‌కు స‌డ‌లింపులు ఇస్తున్నా.. సినిమా మాధ్య‌మాల విష‌యంలో మాత్రం స‌డ‌లింపులు ఇచ్చేందుకు మాత్రం సాహ‌సించ‌డం లేదు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్చించాయి. సినిమా హాళ్ల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేమ‌ని క‌రోనా మ‌రింత‌గా విజృంభిస్తుంద‌ని తేల్చి చెప్పారు. దీంతో తెరమూత‌బ‌డి ఇప్ప‌టికే వంద రోజులు పూర్త‌యినా.. తెర‌దీసేందుకు ఎప్పుడు ముహూర్తం పెడ‌తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news