తమిళనాడు డీఎండీకే అధినేత, నటుడు విజయ కాంత్‌కు (71) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యం బారిన పడిన ఆయన తమిళనాడులోని చెన్నై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఒక్కసారిగా తమిళ చిత్రపరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. విజయ్కాంత్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. చాలా కాలంగా ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి కారణంగా విజయకాంత్ వైద్య పరీక్షల నిమిత్తం చెన్నెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు.
ఆ సమయంలో ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు చక్కర్లు కొట్టగా నవంబర్ 23న విజయకాంత్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని, వైద్యానికి బాగా సహకరిస్తున్నారని డాక్టర్లు తెలిపారు. చికిత్స అనంతరం ఈనెల 11న విజయ్ కాంత్ను డిశ్చార్జి చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన మంగళవారం రాత్రి చికిత్స కోసం మళ్లీ ఆస్పత్రిలో చేరగా కరోనా సోకినట్లు డీఎండీకే ప్రధాన కార్యాలయం గురువారం ఉదయం ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత ఆయన మరణించినట్లు ప్రకటించింది.