అక్రమార్కులు, నేరస్థుల గుండెల్లోనే కాదు ఇళ్లపైన బుల్డోజర్లు పంపడంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ సిద్ధహస్తుడు. ఆయన పేరు వింటేనే నేరస్థుల గుండెల్లో హడల్ పుడుతుంది. నేరాలను అరికట్టడంలో యూపీ సర్కార్ రూటే సపరేటు. అయితే తాజాగా యోగీ ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. ‘‘అజేయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ యోగి’’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కనుంది. శాంతను గుప్తా రాసిన ‘‘ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్’’ పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు మోషన్ పోస్టర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో యోగి ఆదిత్యనాథ్ పాత్రను నటుడు అనంత్ జోషి పోషించారు. మహారాణి 2 ఫేమ్ రవీంద్ర గౌతమ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దినేష్ లాల్ యాదవ్, అజయ్ మెంగి, పవర్ మల్హోత్రా, రాజేష్ ఖట్టర్, గరిమా విక్రాంత్ సింగ్, సర్వర్ అహుజా కీలక పాత్రల్లో నటించారు.యోగి అసలు పేరు అజయ్ సింగ్ బిష్త్ అని తెలిసిందే. ఆయన అసలు పేరు ఆధారంగా ఈ సినిమా టైటిల్ పెట్టినట్లు సమాచారం. హిందీ, తెలుగు, తమిళం , కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.