బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్‌కు ఈ మధ్య వరుస షాక్‌లు తగులుతున్నాయి. వివాదాస్పద పోస్టులే ఆమెకు శాపంగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కించపరిచే విధంగా పోస్టు చేయడంతో.. మహిళా సీఎంపై ఇలాంటి పోస్టు పెడతారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆమెను శాశ్వతంగా నిషేధించింది ట్విట్టర్.
ఇక తాజాగా మరో సోషల్‌మీడియా సంస్థ ఇన్ స్టాగ్రామ్ కూడా షాక్ ఇచ్చింది. తనకు కరోనా సోకిందని కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్టు చేసింది కంగనా. కాగా ఈ పోస్టులో తనకు సోకిన వైరస్‌ను ఫ్లూ వైరస్‌తో పోల్చి చెప్పింది. అలాగే తన బాడీలో వైరస్ పార్టీ చేసుకుంటోందని కామెడీగా పోస్టు పెట్టింది. దీంతో కరోనాపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తారా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక విమర్శలను పరిగణలోకి తీసుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఆమె పోస్టును డిలీట్ చేసింది.
అయితే తన పోస్టు డిలీట్ చేయడంపై కంగనా తన ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో స్పందించింది. ట్విట్టర్‌లోనే ఉగ్రవాదులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు ఉంటారనుకున్నాను.. కానీ ఇన్ స్టా గ్రామ్‌లో కూడా ఉంటారా అంటూ ఘాటుగా స్పందించింది. తన పోస్టు కొందరికి బాధ కలిగించినందుకే డిలీట్ చేశారంటూ చెప్పింది. ప్రస్తుతం ఈ కామెంట్లు ఇప్పుడు మళ్లీ వివాదాస్పదంగా మారాయి.