మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నవదీప్ కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీలు ‘ఈటీవీ విన్’, ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో మార్చి 1 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.
ఈగల్ స్టోరీ ఏంటంటే : జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) రాసిన ఓ కథనంతో మొదలవుతుందీ మూవీ. చిన్న కథనమే అయినా ఆమె రాసిన కథనం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అంశం కావడమే అందుకు కారణం. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ బృందాలు, నక్సలైట్లు, తీవ్రవాదులతోపాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకీ టార్గెట్‌గా ఉంటుంది ఈగల్. సహదేవ్ వర్మ (రవితేజ) ఒక్కడే ఈగల్‌ని ఓ నెట్‌వర్క్‌లా నడుపుతుంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ పత్తి మిల్లుతోపాటు, పోలండ్‌లోనూ ఆ నెట్‌వర్క్ మూలాలు బహిర్గతం అవుతాయి. ఇంతకీ ఈగల్‌కీ, తలకోన అడవులకీ సంబంధం ఏమిటి? సహదేవ్ వర్మ ఎవరు?అతని గతమేమిటి, ఈగల్ నెట్‌వర్క్ లక్ష్యమేమిటి?ఈ విషయాలన్నీ జర్నలిస్ట్ నళిని పరిశోధనలో ఎలా బయటికొచ్చాయనేది సినిమా.