గోపీచంద్ కథల ఎంపికలో ఇంకా అప్‌డేట్ కావడం లేదనే కామెంట్ ఇండస్ర్టీలో ఉంది. ఇంకా పాతకాలం నాటి కథలనే ఎంపిక చేసుకుంటున్నాడని, అందుకే ఆయన సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
గోపీచంద్ తాను ప్రతిష్టాత్మకంగా నటించిన 25వ చిత్రం పంతంతో భారీ పరాజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. జిల్ తర్వాత వరుసగా నాలుగో ఫ్లాప్ సినిమా ఇది. ఈ సినిమా నూతన దర్శకుడు చక్రి దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. తాజాగా తన 26వ సినిమాని తిరు దర్శకత్వంలో చేస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహరీన్ కథానాయికగా నటిస్తుంది. పంతం తర్వాత మరోసారి ఈ ఇద్దరు జోడీ కడుతున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమాకి ఆసక్తికర టైటిల్ ప్రకటించారు. చాణక్య అనే పేరును ఖరారు చేశారు. ఆదివారం చిత్రబృందం టైటిల్‌ని ఖరారు చేస్తూ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. టైటిల్‌తోనే సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
స్పై థ్రిల్లర్‌గా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తెలివికి మారుపేరుగా చాణక్యని పోలుస్తారు. మరి ఇందులో గోపీచంద్ స్పైగా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టు పెడతాడని అర్థమవుతుంది. ఓ ఇంటలిజెంట్ పాత్రలో గోపీచంద్ కనిపించబోతున్నారని చెప్పొచ్చు. ఈ సినిమాని రాజస్థాన్‌లో ప్రారంభించారు. అక్కడ పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నక్రమంలో గోపీచంద్‌కి గాయమైంది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. నెక్ట్స్ షెడ్యూల్ ని హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నారు.
ఇదిలా ఉంటే గోపీచంద్ కథల ఎంపికలో ఇంకా అప్‌డేట్ కావడం లేదనే కామెంట్ ఇండస్ర్టీలో ఉంది. ఇంకా పాతకాలం నాటి కథలనే ఎంపిక చేసుకుంటున్నాడని, అందుకే ఆయన సినిమాలు వరుసగా పరాజయం చెందుతున్నాయని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని సరికొత్తగా ఉండేలా చూసుకున్నారట. అదే సమయంలో అత్యంత స్టయిలీష్‌గానూ ఉంటుందని తెలుస్తుంది.
రాజీపడకుండా క్వాలిటీగా సినిమాని తెరకెక్కించేందుకు నిర్మాత అనిల్ సుంకర ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ సినిమాలో గోపీచంద్ నటిస్తున్నారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.