సినిమా లేకపోతే ఇవాళ ప్రజల్లో తన ఉనికి ఉండేది కాదు అని పవర్ స్టార్ పవన్ కల్యాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. భీమ్లానాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడారు. నిజమైన కళాకారునికి కులం, మతం, ప్రాంతం అనేది పట్టదని పేర్కొన్నారు. చెన్నైలో ఉండే చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌కు తీసుకురావడంతో ఎందరో సినీ పెద్దలతో పాటు చెన్నారెడ్డి లాంటి మహానీయలు తోడ్పాటు అందించారని పేర్కొన్నారు. అలాంటి సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత అభివృద్ధి చేసేవిధంగా తోడ్పాటునందించడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తొలిప్రేమ, ఖుషి సినిమాలను ఎంత బాధ్యతగా తీసామో భీమ్లానాయక్ కూడా అంతే బాధ్యతగా తీశాం అని పవన్ వెల్లడించారు. ముఖ్యంగా అమెరికాలో చదువుకుంటూ సినిమా మీద ఫ్యాషన్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో బలమైన దర్శకుడిగా రూపుదిద్దుకుంటున్న నల్లగొండ వాసి దర్శకుడు సాగర్ కే చంద్రకు ధన్యవాదాలు తెలిపారు. భీమ్లానాయక్ సినిమా అనేది అహంకారానికి ఆత్మాభిమానానికి మధ్య జరిగే మడమ తిప్పని యుద్ధం అన్నారు. ఈ సినిమాకు అన్ని తానై త్రివిక్రమ్ ముందుండి నడిపించారని చెప్పారు. డానియ్ శేఖర్‌గా రానా అద్భుతంగా నటించారని కొనియాడారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్‌లకు ధన్యవాదాలు తెలిపారు.