మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు. మహారాష్ట్రలో ఓటర్ల జాబితాను తారుమారు చేశారని ఆరోపించారు. ఐదు నెలల్లో కొత్తగా 70 లక్షల ఓటర్లను చేర్చారని పేర్కొన్నారు. షిర్డీలో ఒకే భవన్ లో 7000 మంది ఓటర్లను చూపించారని తెలిపారు. లోక్ సభ ఎన్నికలతో పోల్చితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు భారీ సంఖ్యలో పెరిగాయని ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ ఓటర్ల డేటాను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు మోడీ ప్రభుత్వం సరైన పరిష్కారం చూపించలేకపోతుందని విమర్శించారు. ఉత్పత్తి ఆధారిత దేశంగా మనం విఫలమై దానిని చైనాకు అప్పగించామన్నారు. ఇకనైనా మనం ఉత్పత్తి పైనే పూర్తిగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మేకిన్ ఇండియా మంచి ఆలోచనే అయినప్పటికీ దానిని అమలు చేయడంలో ఎన్ఢీఏ ప్రభుత్వం విఫలమవుతోందని తెలిపారు. తెలంగాణ కులగణన పూర్తి చేసినట్టు చెప్పారు. దేశంలో 90 శాతం జనాభా ఉన్న బీసీలు, దళితులు, ఆదివాసీలు, మైనార్టీలకు హక్కులు దక్కడం లేదని ఆవేదన చెందారు.