హీరో కార్తీ నటించిన తాజా చిత్రం ఖైదీ. ఓ విభిన్నమైన కథతో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి కానుకగా తెలుగు, మరియు తమిళ భాషలలో విడుదల అవుతుంది. మూవీ విడుదల నేపథ్యంలో కార్తీ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.
ఈ యాక్షన్ థ్రిల్లర్ గురించి…
ఈ సినిమా ఒక 4 గంటల వ్యవధిలో జరిగే సంఘటనల క్రమం. ఆ సమయంలో ఓ ఖైదీ జీవితంలో ఏం జరిగింది అనేదే సినిమా. ఇది పూర్తి సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్. అయితే సినిమాలో తండ్రి కూతురు మధ్య ఎమోషన్ మాత్రం సినిమాలో మంచి ఫీల్ క్రియేట్ చేస్తోంది.
తండ్రి పాత్ర చేస్తునప్పుడు మీకెలా అనిపించింది …
ఆ పాత్రలో బాగా ఇన్ వాల్వ్ అయ్యేవాణ్ణి. ఎందుకంటే నా జీవితంలో నేను కూడా ఓ కూతురికి తండ్రినే కదా. బహుశా అందుకే ఈ సినిమా కథ నాకు బాగా కనెక్ట్ అయింది అనుకుంటా. ఒకవిధంగా ఇది చాల ఛాలెంజింగ్ రోల్. నా కుమార్తెతో నాకు ఉన్న బాండింగ్ ని ఆ పాత్రలో ఊహించుకుని నటించాను. అందుకే సులభంగా భావోద్వేగాలను చాల సహజంగా పండించగలిగాము.
అసలు సినిమా కథ…
తన కూతురుని చూడాలని పరితపించే ఓ తండ్రి బాధ ఈ కథ. తన కుమార్తెను చూసి దాదాపు 10 సంవత్సరాలు అయిపోతుంది. అసలు ఎందుకు తన కూతురికి అతను దూరం అయ్యాడు ? అతని లైఫ్ లో ఏం జరిగింది ? అనేవి సినిమా చూసినప్పుడు మీకు తెలుస్తుంది.
షూటింగ్ అంతా నైట్ జరిగిందట…
అందుకే ఈ సినిమాని న్యూ ఏజ్ యాక్షన్ ఫిల్మ్ అంది. నైట్ మూడ్ ను చాల సహజంగా షూట్ చెయ్యడానికి మాతో పాటు మిగిలిన అందరూ కూడా చాల బాగా వర్క్ చేశారు. మా బెస్ట్ అవుట్ ఫుట్ ఇచ్చాము. సినిమా చూశాక ఖచ్చితంగా కొత్త అనుభూతిని ఫీల్ అవుతారు.
సినిమా కోసం ప్రత్యేకంగా తీసుకున్న జాగ్రత్తలు…
పూర్తిగా ఖైదీల జీవితాన్ని ఆధారంగా చేసుకుని మా సినిమా ఉంటుంది. అందుకే ఈ చిత్రం కోసం, మేము నిజమైన ఖైదీలను కలవడం జరిగింది. వారి ప్రవర్తనలు మరియు వారి భావోద్వేగాలను అర్థం చేసుకోని దర్శకుడు సినిమాలోని పాత్రలను తీర్చిదిద్దాడు. ఎంతో పరిశోధన చేసారు. ఆ కష్టం సినిమాలో కనిపిస్తోంది.
ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నారు …
సినిమా బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. పైగా ఇప్పటి ప్రేక్షకులకు సినిమాల పై పూర్తి అవగాహన ఉంటుంది. స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్‌ల పై వాళ్ళు అన్ని రకాల సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను సైతం చూస్తున్నారు. కాబట్టి కంటెంట్ బాగుంటేనే వాళ్లను ఆకట్టుకోగలం. అందుకే సినిమాలో కంటెంట్ మరియు పూర్తి యాక్షన్ తో పాటు మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంటుంది.
ఈ మూవీలో హీరోయిన్ కానీ, పాటలు కానీ లేవు కదా. కమర్షియల్ గా రిస్క్ అనిపించలేదా …
లేదండి. జీవిత ఖైదు పడిన ఓ ఖైదీ తన పదేళ్ల కూతురుని కలుసుకోవడానికి జైలు నుండి పారిపోతాడు. ఉత్కంఠ రేపే పోరాటాలతో పాటు, కంటతడి పెట్టించే బలమైన ఎమోషనల్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయి. అలాంటప్పుడు మిగిలిన వాటి గురించి ఆడియన్స్ పెద్దగా ఆలోచించరు.
ఎందుకని మీ నుండి ఎక్కువ సినిమాలు రావడం లేదు …
కొత్త కథలు కోసం మంచి సినిమాల కోసమేనండి గ్యాప్. నేను ఎక్కువుగా రెగ్యూలర్ సినిమాలు కాకుండా కొత్త కంటెంట్ కోసం ప్రయత్నిస్తాను. అయితే ప్రతి సంవత్సరం నా నుంచి కనీసం ఒక్క సినిమా అన్నా రిలీజ్ అవుతుంది.
మీ తదుపరి ప్రాజెక్ట్స్..
ప్రస్తుతం ఒక సినిమా జరుగుతుంది. అలాగే కొన్ని కథలు విన్నాను బాగున్నాయి. అయితే ప్రస్తుతానికి నా దృష్టి అంతా ‘ఖైదీ’ విడుదల పైనే ఉంది.