రివర్స్ టెండరింగ్ విధానం ఏపీ ప్రభుత్వానికి బ్రహ్మాండంగా ఖజానాకు మేలు చేస్తోందా.. జగన్ ఐడియా సూపర్ గా వర్కవుట్ అయ్యిందా.. అంటే అవునంటున్నాయి వైసీపీ వర్గాలు. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ సర్కారు ఇప్పటికే దాదాపు 900 కోట్లు మిగిల్చిందని లెక్కలు చెబుతున్నాయి.
పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం రివర్స్ టెండర్లలో రూ.782.80 కోట్లు మిగిలాయని చెబుతున్నారు. పోలవరం లెఫ్ట్ కనెక్టివిటీ 65వ ప్యాకేజీ పనులకు నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో రూ.58.53 కోట్లు మిగిలాయి. తాజాగా వెలిగొండ రెండో టన్నెల్ మిగిలిన పనులకు నిర్వహించిన రివర్స్ టెండర్లలో రూ.61.76 కోట్లు మిగిలాయి.
అంటే మొత్తం 900కోట్లు జగన్ ఏపీకి మిగిల్చారన్నమాట. వెలిగొండ రెండో సొరంగం పనులను 2006–07లో హెచ్‌సీసీ–సీపీపీఎల్ సంస్థ రూ.735.21 కోట్లకు దక్కించుకుంది. 8,580 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం, 9.2 మీటర్ల వ్యాసంతో 18.787 కి.మీ.ల పొడవున సొరంగం తవ్వి 0.3 మీటర్ల మందంతో లైనింగ్ పనులను పొడిగించిన గడువు ప్రకారం 2020 మార్చి నాటికి ఆ సంస్థ పూర్తి చేయాలి. కానీ ఆ సంస్థపై గతేడాది ఆగస్టులో 60 సీ కింద వేటు వేశారు.
అప్పటికి 10.750 కి.మీ.ల పనులను పూర్తి చేయగా రూ.489 కోట్ల బిల్లులు చెల్లించారు. అంటే రూ.246.21 కోట్ల పనులు మిగిలాయి. కానీ 60 సీ కింద తొలగించినప్పుడు ఆ పనుల విలువను రూ.299.48 కోట్లుగా తప్పుగా లెక్కించారు. 2017–18 ధరల ప్రకారం ఆ పనుల విలువను రూ.720.26 కోట్లకు పెంచేశారు.
ఈ ప్రాజెక్టు కోసం 528.35 కోట్ల అంచనా వ్యయంతో నిర్వహించిన టెండర్లలో 7 శాతం తక్కువ ధరకు అంటే రూ. 491.37 కోట్లకు మేఘా దక్కించుకుంది. దాంతో మొత్తమ్మీద 11.69 శాతం తక్కువ ధరకు పనులు అప్పగించినట్లయింది. దానివల్ల 61.76 కోట్లు ఆదా అయ్యాయి. అంతా బాగానే ఉంది..కానీ ఈ రివర్స్ టెండరింగ్ వల్ల ప్రాజెక్టుల నాణ్యత దెబ్బ తినకుండా చూడాల్సిన అవసరం ఉంది.