బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్‌ను సినిమాల నుంచి బహిష్కరించాలని కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలిలో ఫిర్యాదు నమోదైంది. హిందూ దేవుళ్లు, హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడమే ఇందుకు కారణం. సినీ పరిశ్రమ నుంచి ఆయనను బహిష్కరించాలని, కన్నడ సినిమాల్లో ఆయనకు అవకాశం ఇవ్వొద్దని ఫిర్యాదులో కోరింది. అయినప్పటికీ ఆయనకు అవకాశాలు కల్పిస్తే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించింది. ఇటీవల ఓ వార్తా ఛానెల్ చర్చలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
యూపీలో రథోత్సవానికి ఆయన ముంబై నుంచి మోడళ్లను పిలిపించి వారి ముఖాలకు రంగులు వేసి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడి వేషాలు వేయించారని ఆరోపించారు. ఐఏఎస్ అధికారులు కూడా వారికి నమస్కరిస్తున్నారని అన్నారు. ఇటువంటి చర్యలు చాలా ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హిందూ మహాసభ ప్రకాశ్‌రాజ్‌పై ఫిర్యాదు చేసింది.