దివంగత నటీమణి సూర్యకాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జనరేషన్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అలరించిన ఈమె మన మధ్య లేకపోయినా సరే తన సినిమాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సూర్యకాంతం ఒక నటి మాత్రమే కాదు అద్భుతమైన ప్రతిభాశాలి.. ఇదిలా ఉండగా హీరోయిన్ కావాలనే కలలు ఎన్నో కని చేతికి అవకాశం అందిన సమయంలో నెరవేర్చుకోలేక ఆమె పడిన కష్టాలు అంతా ఇంతా కాదని చెప్పాలి.
ఇక ఈమె జీవితంలో కూడా ఇంత విషాదం ఉందా అని అనిపించక మానదు. పాత్ర ఏదైనా సరే వెండితెరకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన ఈమె సహజమైన నటనతోనే ఆ పాత్రకు మంచి పేరు తెచ్చేది. అంతేకాదు ముఖ్యంగా గయ్యాళి అత్త పాత్రలలో సూర్యకాంతం తప్ప మరెవరు చేయలేరు అన్నంతగా ఆ పాత్రలతో ఇమిడిపోయేది. వెంకటకృష్ణ రాయపురంలో జన్మించిన సూర్యకాంతం చిన్నతనంలోనే అల్లరి పిల్లగా ముద్ర వేయించుకొని.. కాలేజీ చదువుకునే సమయంలో హ్యాపీ క్లబ్లో నాటకాలు కూడా వేసేది.
అదే సమయంలో ఎస్వీ రంగారావు, ఆదినారాయణరావు , అంజలి వంటి ప్రముఖులతో పరిచయం పెంచుకొని సినీ ఇండస్ట్రీలోకి వెళ్లాలన్న ఆసక్తిని మరింత బలం చేసుకుంది. ముఖ్యంగా హిందీ సినిమా పోస్టర్ లే ఆమెను ఇండస్ట్రీలోకి ఆకర్షించాయి.. కానీ ఆర్థిక స్తోమత లేక తన ఆలోచనలను విరమించుకున్న ఈమె ఆ తర్వాత కొంతమంది ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి వచ్చింది. అలా నారద నారది అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించిన సూర్యకాంతం కు హీరోయిన్ గా నటించాలనే కల ఉండేది. అలా సౌదామిని సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. కానీ కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో అవకాశాన్ని కాస్త వదులుకుంది. అలా ఎన్నో కలలుకని చేతి వరకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకే పరిమితమైంది.