సాహసాలంటే ఇష్టపడే ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సముద్రంలో మునిగిపోయిన ‘టైటానిక్’ షిప్ ప్రాంతాన్నిఇప్పటివరకూ 33సార్లు సందర్శించారట. 13వేల అడుగుల లోతున ఉండిపోయిన చరిత్ర సజీవ సాక్ష్యాన్ని ఆయన డాక్యుమెంటరీ రూపంలోనూ తీసుకొచ్చారు.
సముద్రగర్భంలో ఆచూకీ లభించకుండా పోయిన టైటాన్ కథ విషాదాంతమైంది. తీవ్రమైన పీడనం పెరగడం వల్ల ‘టైటాన్’ పేలిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్‌గార్డ్ ప్రకటించింది. ఈ క్రమంలో టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని అనేకసార్లు సందర్శించిన సందర్భంగా ఆ సాహసయాత్ర అనుభూతిని గతంలో జేమ్స్ కామెరూన్ పంచుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
‘ఈ భూమ్మీద అత్యంత క్రూరమైన ప్రదేశాల్లో అది ఒకటి’ అని టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని ఒక్క ముక్కలో చెప్పేశారు జేమ్స్ కామెరూన్. మనుషులు ఎప్పుడూ చూడని ప్రదేశాలను చూడటమంటే తనకెంతో ఆసక్తి అని, అందుకే ఆ ప్రాంతానికి వెళ్లినట్లు చెప్పారు.
జేమ్స్ కామెరూన్ 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్‌మెరైన్‌లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు. ప్రస్తుతం మునిగిపోయిన టైటాన్ గురించి కామెరూన్ ఎక్కడా స్పందించలేదు.