యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ బ‌ర్త్‌డే టీజ‌ర్ అది‌రింది!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన టీజ‌ర్‌ని మేక‌ర్స్ శ‌నివారం రిలీజ్ చేశారు. గ‌త ఏడాది కార్తితో ఎలాంటి డ్యూయెట్స్ లేకుండా క‌నీసం హీరోయిన్ కూడా లేకుండా ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్రం `ఖైదీ`. ఈ మూవీతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్ హాస‌న్ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని చేస్తున్న విష‌యం తెలిసిందే.

రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. క‌మ‌ల్ కెరీర్‌లో న‌టిస్తున్న 232వ సినిమా ఇది. ఈ చిత్రానికి `విక్ర‌మ్‌` అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు. కమల్ ఒంటరి ప్రదేశంలో నివసిస్తున్నట్లు టీజర్ చూపించారు. అతను కొద్దిమందికి భోజనం ఏర్పాటు చేయ‌డం.. వారు రావ‌డానికి ముందే ఇంటి న‌లుమూల‌ల్లో మార‌ణాయుధాలు దాచి వాటితో విందుకు వ‌చ్చిన వారిని హ‌త్ మార్చ‌డం వింద‌త‌గా వుంది. డైనింగ్ టేబుల్ కింద గొడ్డళ్ల‌ని దాచి వాటితో దాడికి దిగ‌డం ప్రాజెక్ట్‌పై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

టీజ‌ర్‌లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే `ఒకప్పుడు విక్రమ్ అనే దెయ్యం ఉండేది` అని టీజర్ చెబుతోంది. ఇది థ్రిల్లర్ కాని హర్రర్ జానర్ కాదని తెలుస్తోంది. 1986లో క‌మ‌ల్ న‌టించిన చిత్రం `విక్ర‌మ్‌`. శ్రీ‌హ‌రి కోట రాకెట్ మిస్సింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఆ చిత్రంలోని టైటిల్ సాంగ్‌ని య‌దావిదిగా ఈ మూవీ టీజ‌ర్‌కు ద‌ర్శ‌కుడు వాడిన తీరుచూస్తుంటే గ‌తం వ‌చ్చిన `విక్ర‌మ్‌`కు ఈ విక్ర‌మ్‌కు ఏదైనా లింక్ వుందా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. త్వ‌ర‌లోనే ఈ మూవీ షూటింగ్‌ని ప్రారంభించ‌బోతున్నారు.