కరోనా లాక్‌డౌన్ కారణంగా ఓ వైపు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోవడంతోపాటు అటు థియేటర్లు కూడా మూతపడ్డాయి. దీంతో వేసవిలో రిలీజ్ కావల్సిన సినిమాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు రూ.కోట్లు వెచ్చించి సినిమాలు తీసిన నిర్మాతలు ఆ డబ్బుకు వడ్డీలు కట్టలేక.. సినిమాలను విడుదల చేసే అవకాశం లేక.. తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా ఇప్పుడప్పుడే మళ్లీ థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేదు. దీంతో నిర్మాతలకు ప్రస్తుతం నష్టాలను పూడ్చుకోవడానికి సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేయడం తప్ప.. మరొక అవకాశం కనిపించడం లేదు. అందుకనే ఇప్పటికే విడుదల కావల్సిన పలు సినిమాలతోపాటు త్వరలో విడుదల కానున్న పలు సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫాంలపై రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీబాంబ్ మూవీ మే 22న విడుదల కావల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ కారణంగా చిత్రం విడుదల సాధ్యపడడం లేదు. దీంతో మూవీ మేకర్స్ ఆ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పటికే డిస్నీ హాట్ స్టార్ ప్రతినిధులతో లక్ష్మీబాంబ్ మూవీ మేకర్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారని.. చిత్రాన్ని ఆ యాప్‌లో విడుదల చేసేందుకు ఆ సంస్థ వారు ఏకంగా రూ.100 కోట్లను సైతం చెల్లించేందుకు సిద్ధమని ముందుకు వచ్చారట. దీంతో లక్ష్మీబాంబ్‌ను ఆ ఓటీటీ ప్లాట్‌ఫాంపైనే విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట.
ఇక టాలీవుడ్ నటి అనుష్క నటించిన నిశ్శబ్దం చిత్రం కూడా ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ లాక్‌డౌన్ కారణంగా అది సాధ్యపడడం లేదు. దీంతో ఈ మూవీని ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే నిర్మాతలు ఆ వార్తలను కొట్టి పారేశారు. కానీ.. తాజాగా ఓ సంస్థ ఈ మూవీకి రూ.30 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. దీంతో ఈ మూవీ కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంపైనే విడుదలవుతుందని తెలిసింది. అయితే ఈ విషయాలపై స్పష్టత రావాలంటే.. మరికొద్ది రోజుల వరకు వేచి చూడక తప్పదు..!