లైగర్ ట్రైలర్ రివ్యూ.. స్ట్రీట్ ఫైటర్ బాక్సింగ్ రింగ్​లో అడుగుపెడితే..

-

సెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న రోజు వచ్చేసింది. ఆయన హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లైగర్ ట్రైలర్‌ విడుదలైంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఈ ప్రచార చిత్రాన్ని తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి, ప్రభాస్‌, మిగతా భాషల్లో అక్కడి స్టార్ హీరోలు రిలీజ్ చేశారు.

ఒక లయన్‌కి టైగర్‌కి పుట్టిండాడు. క్రాస్‌ బ్రీడ్‌ సార్‌ నా బిడ్డ అంటూ రమ్యకృష్ణ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ యాక్షన్‌ సీక్వెన్స్‌లలో విజయ్‌ దేవరకొండ‌ చేసిన స్టంట్స్​తో మెప్పించేలా ఉంది. కొడుకుని తీసుకుని రమ్య‌కృష్ణ ఊరురా తిర‌గ‌టం.. కోపం వ‌చ్చిన‌ప్పుడల్లా అతడిని కాలితో త‌న్న‌టం వంటి స‌న్నివేశాల‌ను సినిమాలో చూడొచ్చు. అంటే ఓ వైపు మ‌ద‌ర్ సెంటిమెంట్‌ను పూరి జ‌గ‌న్నాథ్ ఎలివేట్ చేస్తూనే.. మ‌రో వైపు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే మ‌ధ్య‌ ల‌వ్‌, రొమాంటిక్ యాంగిల్‌ను చూపించారు.

సినిమాలో స్ట్రీట్ ఫైట్స్ చేసుకునే హీరో.. బాక్సింగ్ రింగ్‌లోకి దిగితే ఎలా ఉంటుంద‌నేదే క‌థతో తెరకెక్కించారని ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఇక సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన మైక్ టైస‌న్ లుక్‌ను కూడా రివీల్ చేశారు పూరి. నువ్వు ఫైట‌ర్ అయితే మ‌రి నేనెవ‌రినీ అంటూ మైక్ టైస‌న్ చెప్ప‌టం ఆకట్టుకునేలా ఉంది. మరి ఆయన నెగటివ్​గా కనిపించారా లేదా అనేది తెలియదు. మొత్తంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఓ హాలీవుడ్ హీరోలా ఎలివేట్ చేసిన పూరి.. ఈ సారి కూడా కేవలం మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తీశారని అర్థమవుతోంది. ఇక ఈ చిత్రం చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో తమ రివ్యూలు కామెంట్లు చేస్తున్నారు.

చాలా మంది ఈ ట్రైలర్ చూసి అమెజింగ్.. హవోక్ అంటూ.. కామెంట్ చేయగా… కొంత మంది ట్రైలర్ రిలీజ్ చేయమంటే… సాంగ్ రిలీజ్ చేశారెంట్రా బాబు అంటూ ట్వీట్ చేస్తున్నారు. మరికొంత మంది ఊరమాస్ ట్రైలర్… బాగుంది.. బ్లాక్​ బస్టర్ లోడింగ్ అంటున్నారు.
కాగా, విజయ్‌ దేవరకొండ కెరీర్‌లోనే మొదటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ ఇది. మధర్‌ సెంటిమెంట్‌, కిక్‌ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో విజయ్‌కు తల్లిగా రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. అనన్యపాండే కథానాయిక. పూరీ కనెక్ట్స్‌, ధర్మా ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడెక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25 ఈ సినిమా విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version