సొంత ఊరు ని ఆదుకుంటున్న లెక్కల మాస్టారు ..!

-

కరోనా వ్యాపిస్తున్న కారణంగా సామాన్యుల నుండి సెలబ్రెటీ వరకు అందరికి ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టిన సంగతి తెలిసందే. బ్యాంక్ బాలెన్స్ ఉంటే సరే లేనివాళ్ళ పరిస్థితి ఈ సమయంలో నభూతో న భవిష్యత్ అన్న విధంగా తయారైంది. తమ బ్యాంక్ అకౌంట్ లో డబ్బున్న వారు నెల రెండు నెలలు జీతాలు, లాభాలు రాకపోయినా సర్ధుకోగలరు. కాని దినసి వేతనం వచ్చే కూలీలు ప్రతి రోజు ఏదో ఒక పని చేస్తే తప్ప ఆ రోజు గడవదు. లాక్ డౌన్ కారణంగా అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్ళని ఆదుకోవడం కోసం చిత్ర పరిశ్రమలోని అనేకమంది తమ వంతు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ దర్శకుడు, నిర్మాత సుకుమార్ తన సొంత గ్రామస్తులకు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.

 

తూర్పు గోదావరి జిల్లా మకిలిపురం మండలం మట్టపుర్రు గ్రామం సుకుమార్ సొంత ఊరు. ఆ ఊర్లో ఉన్న పేదవారిని ఆదుకునేందుకు సుకుమార్ ముందుకొచ్చారు. గ్రామంలో డైలీ కూలీలకు సాయం అందించనున్నారు. గ్రామంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వెయ్యి రూపాయలు ఆర్ధిక సహాయం అందించనున్నారు. మొత్తంగా అయిదు లక్షల రూపాయలను ఆయన గ్రామస్తులకు ఇవ్వబోతున్నారు. సుకుమార్ ఇలా సొంత వూరికి సహాయం చేయాలన్న ఆలోచన రావడం ఎంతో హర్షించదగ్గ విషయం అని ఇప్పుడు అందరూ ఆయనని అభినందిస్తున్నారు.

ఇక ఇప్పటికే సుకుమార్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి పది లక్ష విరాళంను ప్రకటించిన విషయం తెల్సిందే. సినీ పరిశ్రమకు చెందిన పలువురు తమవంతు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. విభిన్నంగా దర్శకుడు సుకుమార్ తను పుట్టి పెరిగిన గ్రామస్తులను ఆదుకునేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ సుకుమార్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన తన గ్రామస్తులు ఆనందంలో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version