అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం మరికొద్ది క్షణాల్లో ఆవిషఅకృతం కాబోతోంది. ఈ నేపథ్యంలో బాలరాముడి విగ్రహప్రాణ ప్రతిష్ఠకు ఆహ్వానం అందుకున్న అతిథులు అక్కడికి చేరుకున్నారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ వేడుకకు ఆహ్వానం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లోఆయన ఆనందం వ్యక్తం చేశారు.
‘‘చరిత్ర సృష్టించేలా.. చరిత్రను పునరావృతం చేసేలా.. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా అయోధ్యలో జరిగే రామలల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అందిన ఆహ్వానం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నా. ఇది నాకు మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. 500 సంవత్సరాలుగా తరతరాలు వేచి చూసిన అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతమవుతోంది. అంజనాదేవి కుమారుడు, ‘చిరంజీవి’ అయిన ఆ హనుమాన్.. భువిపై ఉన్న ఈ అంజనాదేవి కుమారుడనైన నాకు వెలకట్టలేని గొప్ప క్షణాలను బహుమతిగా ఇచ్చినట్లు అనిపిస్తోంది. దీనిని మీతో పంచుకోవడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇంత మహోన్నత కార్యక్రమం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఉత్తర్ ప్రదేశ్‌ముఖ్యమంత్రి యోగిజీకి కూడా శుభాకాంక్షలు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరికీ శుభాభినందనలు. రేపటి ఆ బంగారు క్షణాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. జై శ్రీరామ్’’ అని ట్వీట్ చేశారు.