మరికొద్ది క్షణాల్లో అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. 161 అడుగుల ఎత్తుతో మూడు అంతస్తులుగా (జీ ప్లస్ 2) చేపడుతున్న మందిర నిర్మాణానికి ఇప్పటివరకు ఎంత ఖర్చయింది. ఆలయ నిర్మాణం పూర్తవ్వడానికి ఇంకెంత ఖర్చవుతుంది. ఇప్పటికే ఉన్న విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయకుండా కొత్త విగ్రహాన్ని ఎందుకు తయారు చేయించారు వంటి విషయాలు తెలుసుకుందాం.
అయోధ్య భవ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.1,100 కోట్లకుపైగా ఖర్చయినట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. మొత్తం పనులు పూర్తి చేసేందుకు మరో రూ.300 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. మరోవైపు తాత్కాలిక మందిరంలోని పాత రామ్ లల్లా మూర్తిని కొత్త విగ్రహం ముందు ఉంచుతామని తెలిపారు. పాత విగ్రహం ఐదారు అంగుళాల ఎత్తు ఉండటం వల్ల 25- 30 అడుగుల దూరం నుంచి ఇది స్పష్టంగా కనిపించదని చెప్పారు. అందుకే పెద్ద మూర్తి అవసరమైందని చెప్పారు.