ఫిబ్రవరి 24 శ్రీదేవి వర్థంతి
నీరులో నీరు అది ఉప్పునీరు.. మహా సముద్రాన్ని దాచేసుకున్న బిందువు.. అది మరీ భారం.. నీకో తీరానికి చేరుకోగల సమర్థత ఎలా ఉందో నాకు తెలియదు.. అది మరణ తీరం అని తెలియదా.. కొద్దిగా శ్వాసలో అలజడి.. జీవితంలో అలసట ఇవి మాత్రమే కాదు మా ఊహల్లో భయము ఆందోళన..ఇవేనా వీటితో నీవు పంచిన ప్రేమ నీకోసం దాచిన ప్రేమ పిల్లా ఆ పదహారేళ్ల ప్రాయం ఏమాయె! నీ మోములో ఈ విషాదం ఏంటో! బాధని నటించడం తెలియక కొంచెంగా సతమతమవుతున్న మా లాంటి కొన్ని హృదయాలకు నటన నేర్పు.
నాకే కాదు ఈ లోకానికి కూడా..! నిశ్శబ్దంగా ఉండిపోవడం నిశ్శబ్దంలో లీనమైపోవడం ఎంత తేడా… ఇక కోరికకూ ఆశకూ మధ్య ఎడం పాటించాలి. ఓ సారి ఆ పార్థివ దేహం లో ఉండిపోయిన జ్ఞాపకాలన్నీ ఇటుగా వచ్చి పలకరించిపోవాలి. ఈ అంతిమ స్థానం ఎంత బాగుందో.. డియర్ శ్రీదేవి లవ్ యూ సో మచ్..
లోకంలో కన్నెల సొగసు అంతా వెన్నెలకే అంకితం అనుకున్నాను.. కానీ కన్నియ నవ్వులన్నీ వె-న్నెలకూ మల్లెలకూ సొంతం. మహా నిద్ర నటించడం కొంచెం కష్టమే కానీ ఈ రోజు అదెందుకో వాస్తవం అయి పోయింది. దూరం పాటించడానికి దూరంగా ఉండడానికి ఎంత తేడా! కొన్నేళ్లు మేకప్ ముఖానికి దూరంగా ఇప్పుడు నా అనే ఈ ప్రపంచానికి దూరంగా.. జామురాతిరి దాటాక పలకరించిన ఆ..మరణ సందర్భానికి కించిత్ కూడా విజ్ఞత లేదేమో!
నీలి కళ్ల సోయగానికి సాహో అని ఎంతకాలమైందో.. ! ఓ చిన్న థియేటర్ లో ఆ అతి లోక సుందరిని చూసి మురిసిపోయి ఎన్నాళ్లైంది. పువ్వూ రెమ్మతో ఆ పిల్ల చుంబిస్తుంటే వహ్!! ఆ ఛాన్స్ మనకెప్పు డా అనుకుని ఎన్నాళ్లైందో! ఔను! అందాల తారని ఊహలకే పరిమితం చేయగలం.. కొన్ని సామాన్యా లను విశేషణాలుగా మలచగలం మనం.. అలా సామాన్యమైన విశేషం శ్రీదేవి.. నా దేవి..
ఏ బుచాడు బుల్లిపెట్టెలో దాగాడో కానీ ఈ పిల్లను మాత్రం ఆ ఆరడగుల నేలలో దాచేశాడు ఆ దేవుడు.. దేవుడంటే ఇంకా అసహ్యం కలిగిందట రామూకి.. వాడొక్కడికీ కలిగితే అది ప్రేమ కాదు స్వార్థం.. అంద రికీ కలిగింది కనుక అది స్వార్థం కాదు ప్రేమ. నిజమే ఆకర్షణలోనే చాలా కాలం ఆ.. సోయగాల ఆరాధ నలోనే చాలా కాలం .. నేనూ ఇంకా ఇంకొందరు.. వసంత కోయిలను ఏడాదికోసారి పలకరించాలా.. ఏ మో! ఏడాదంతా ఈ కోయిల వెన్నంటే ఉండేదిగా..ఇప్పుడు ఆ..రాగం వినిపించడం లేదు.. స్వర స్థానం ఎక్కడో తెలపడం లేదు. అసలీ ఎడారిలో కోయిలలా ఇలా ఎలా మారిపోయిందో కూడా తెలియదు. దు బాయ్ దారులు నన్ను మోసం చేశాయి నా అందాల రాశిని తనలో కలిపేసుకుని ఆ చివరి పాద ముద్ర లను తమ నేలలోనే దాచేసుకున్నాయి.
ఇలాంటి మోసం పొరుగు దేశం చేస్తుంది అనుకోలేదు. ఇలాం టి విషాదం ఈ ఉదయం మోసుకువస్తుందనీ తెలియదు.ఆకాశ దేశమా కాసిన్ని చినుకులు పంపు..ఆ అందాల తార రాకతో నీ నేల పునీతం.. ఆ ధామం పునీతం కాక మానదు.నటించడం మానుకొమ్మ ని ఈ లోకానికి చెప్పవూ..! డియర్ శ్రీదేవి గారూ పోతూ పోతూ మా ప్రేమని మీరు పట్టుకుపోమాకండి .. అది ఎప్పుడూ మా చిన్ని గుండెల్లో పదిలంగా ఉండేలా చేసి పొండి.. అబద్ధమో/నిజమో/యాంత్రిక మో ఏదో ఒకటి జీవితం కదా ఇలానే ఎలానో మీ ఆరాధనలో మీ ఆకర్షణలో జీవించనీయండి.. వెళ్లిరండి.. ఎ క్కడున్నా టేక్ కేర్ ..
– రత్నకిశోర్ శంభుమహంతి