టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్.. రెండో ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉంటోంది. ఈ బ్యూటీ ఇటీవల నటించిన సినిమా మ్యూజిక్ స్కూల్. శ్రియా, శర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మ్యూజిక్ స్కూల్’ మూవీకి పాపారావు బియ్యాల దర్శకత్వం వహించారు. సంగీతం ఇతివృత్తింగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు, తమిళం, హిందీలో ఈ సినిమా అందుబాటులో ఉందని చిత్ర నిర్మాణ సంస్థ యామిని ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. సుహాసిని ములే, ప్రకాశ్ రాజ్, షాన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజిక్ అందించారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది.
మ్యూజిక్ స్కూల్ స్టోరీ ఏంటంటే.. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్ నేపథ్యంలో సాగే కథ ఇది. చదువు ఒక్కటే ముఖ్యమనుకుని సాంస్కృతిక కార్యక్రమాలకు తమ పిల్లలను దూరంగా ఉంచుతారు తల్లీదండ్రులు. గోవాకు చెందిన మేరీ డీక్రూజ్ (శ్రియా శరణ్) మ్యూజిక్ టీచర్‌గా ఆ పాఠశాలకు వస్తుంది. అక్కడ మనోజ్ (శర్మాన్ జోషి) డ్రామా టీచర్‌గా పనిచేస్తుంటాడు. ఆలోచనలు ఒకేలా ఉండడంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. మరి, ఇద్దరు కలిసి తమ విద్యార్థుల తల్లీదండ్రుల్లో మార్పు తీసుకొచ్చారా? మార్కుల ఒత్తిడి నుంచి విద్యార్థులకు ఉపశమనం కలిగించారా? మేరీ.. గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి కారణమేంటి? అన్నది మిగతా కథ.