టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయణ్ను అదుపులోకి తీసుకోవడం.. అనంతరం జడ్జి ముందు నిలబెట్టడం.. రిమాండుకు తరలించడం.. ఈ ప్రక్రియంతా నాటకీయ పరిణామాల మధ్య చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్టు.. రిమాండు.. ఏపీలో కలకలం సృష్టిస్తోంది. బాబుకు మద్దతుగా ఓవైపు టీడీపీ.. మరోవైపు జనసేన.. ఇంకోవైపు అభిమానులు ఏపీ సర్కార్కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే చంద్రబాబును రాజమహేంద్రవరం తరలించే ప్రక్రియలో ఏపీ పోలీసులు అరాచకానికి పాల్పడ్డారు. జోరు వర్షంలో వీధి దీపాలు ఆర్పించి ప్రయాణం కొనసాగించారు. 144 సెక్షన్ సాకుతో తెలుగు దేశం నేతలను ఎక్కడికక్కడ నిర్భందించారు. చంద్రబాబు వాహనశ్రేణి వెనుక ఇతర నేతల వాహనాలు రాకుండా అడ్డుకున్నారు. రహదారిపై లారీలు అడ్డుపెట్టించి మరీ ఇతర వాహనాలను అడ్డుకున్నారు. గన్నవరం వద్ద గంటన్నరపాటు వాహనాలను నిలిపివేశారు.
టోల్‌గేట్ల వద్ద ఇతర వాహనాలు రాకుండా నియంత్రించారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన టీడీపీ శ్రేణులపై లాఠీఛార్జి చేశారు. చంద్రబాబును రాజమహేంద్రవరం తరలింపులోనూ పోలీసులు నిర్లక్ష్యం చేశారు. రెండున్నర గంటల ప్రయాణాన్ని నాలుగున్నర గంటలు సాగదీశారు. అప్పటికే 48 గంటలు నుంచి నిద్ర లేకుండా ఉన్న చంద్రబాబును మరింత ఇబ్బంది పెట్టారు.