గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం డాకు మహారాజ్. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
అంతేకాదు.. ఇప్పటికే మూడు సాంగ్స్ విడుదలయ్యాయి. ఈ మూవీ సంక్రాంతికి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు.