అర్జున్ రెడ్డి అనే హిట్ తెలంగాణ స్టార్ విజయ్ దేవరకొండను ఎక్కడికో తీసుకెళ్లింది. ఆ సినిమా తెలుగులోనే రిలీజ్ అయినా సౌత్ లోనే క్రేజీ స్టార్ అయ్యాడు. అంటే అర్జున్ రెడ్డి ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. తాజాగా అందుకు మరో ఉదహరణే అతని అభిమానులు బెంగుళూరు పోలీసు చేతుల్లో దెబ్బలు తినడం. లాఠీలు తీసుకుని బాదుతోన్న మా హీరోని చూడాలంటూ పోలీసుల మీదకి ఎగబడి మరీ వచ్చారు. దెబ్బలను సైతం లెక్క చేయకుండా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంత క్రేజ్ పక్కరాష్ట్రంలోకి ఏ హీరోకి సాధ్యం అంటే? అది అసాధ్యమనే చెప్పాలి. రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలా మంది స్టార్లు ఉన్నారు.
కానీ వాళ్లెవరికి లేని గుర్తింపు విజయ్ దేవరకొండకు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటించిన డియర్ కామ్రేడ్ కు రిలీజ్ కు రెడీ అవుతుండటంతో ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నాడు. దీనిలో భాగంగా బెంగుళూరులో మ్యూజికల్ పెస్టివల్ పేరుతో ప్రచారం ఠారెత్తిస్తున్నాడు. దీనిలో భాగంగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లో ఈవెంట్లు ప్లాన్ చేసారు. ఈ నేపథ్యంలో అభిమానుల్ని కలుస్తున్నాడు. బెంగుళూరు లో ఓ వేదిక వద్ద ఇసుక వేస్తే రాలనంత జనం తరలి వచ్చారు. నిర్వాహకులు ఊహించని విధంగా అభిమానులు తండొపతండాలుగా బారులు దీరారు. దీంతో తోపులాట జరిగింది. అదుపు చేసే ప్రయత్నంలో పోలీసులు లాఠీలు ఝుళించాల్సి వచ్చింది.
ఓ లేడీ అభిమాని అయితే ఏకంగా ముఖం మీదనే బొబ్బలు వచ్చేలా తన్నులు తింది. దానికి సంబంధించిన ఓ వీడియో కూడా వైరల్ అవుతోంది. దీంతో రౌడీస్టార్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. అభిమానులను అసౌకర్యానికి ఎందుకు గురి చేసారని సీరియస్ అయ్యాడట. అంత ఇరుకుగా ఉన్న వేదికను ఎందుకు ఎంపిక చేసారని? దానికి కావాల్సిన డబ్బులు కావాల్సి వస్తే నన్నే అగడొచ్చు కదా అని అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇలాంటి సంఘటనలు ఇంకెక్కడా జరగకూడాదని హెచ్చరించాడుట. దీంతో చెన్నై, హైదరాబాద్ లో జరిగే ఈవెంట్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొండని సూచించాడుట.