సీనియర్ దర్శకులు మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. మారుతున్న ట్రెండ్‌కి తగ్గట్టుగా రాణించలేకపోతున్నారు. బి.గోపాల్, రేలంగా నరసింహారావుతోపాటు ఆ తర్వాతి తరం శ్రీనువైట్ల, శ్రీకాంత్ అడ్డాల, కృష్ణవంశీ, రామ్‌గోపాల్ వర్మ, చివరికి వి.వి.వినాయక్ సైతం ఒకప్పుడు అనేక బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. ఇండస్ర్టీలో నిలిచిపోయే సినిమాలందించారు. కానీ ఇప్పుడు దర్శకులుగా నిరూపించుకోలేకపోతున్నారు. దానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అతీతం కాదు. ఆయన 2006లో వచ్చిన శ్రీరామదాసు తర్వాత విజయాలు అందుకోలేకపోతున్నారు. బాలకృష్ణతో చేసిన పాండురంగడు, మంచుమనోజ్, తాప్సీ నటించిన ఝుమ్మంది నాదం, నాగార్జునతో బ్యాక్ టూ బ్యాక్ చేసిన శిరిడిసాయి, ఓం నమో వేంకటేశాయ చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి.
దీంతో శతాధిక చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాఘవేంద్రరావు సైతం సక్సెస్ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. కమర్షియల్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన రాఘవేంద్రరావు టాలీవుడ్‌లో అనేక సూపర్ హిట్ చిత్రాలను రూపొందించారు. ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో ఆయన్ని మించిన దర్శకుడు లేడనే చెప్పాలి. అలాంటి రాఘవేంద్రరావు తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడిగా పూర్వవైభవాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మంగళవారం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు హీరోయిన్లతో దర్శకుడు ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నా యాభై ఏళ్ళ సినీ జీవితం లో అన్న(ఎన్టీఆర్)గారితో ప్రయాణం ఎన్నటికీ మరువలేనిది. గత జన్మల సుకృతంగా భావిస్తాను. ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా నా తదుపరి చిత్రాన్ని ప్రకటించడం ఆనందం గా ఉంది. నా కెరీర్ లో ఈ చిత్రం ప్రత్యేకం. మరింత కొత్తగా ప్రయత్నించబోతున్నాను. పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా. జయమో ఎన్టీఆర్’ అంటూ ట్వీట్ చేశారు. 2017లో రిలీజ్ అయిన ఓం నమో వేంకటేశాయ సినిమా తరువాత రాఘవేంద్ర రావు మరో సినిమా చేయలేదు.
ఒక దశలో ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకున్నట్టే అన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఆయన తదుపరి చిత్రానికి సంబందించిన ప్రకటన రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి చిత్రంలో రాఘవేంద్రరావు మళ్ళీ నిరూపించుకుంటారా? పూర్వవైభవాన్ని పొందుతారా? లేదా చూడాలి. మరోవైపు రాఘవేంద్రరావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పదవికి ఇటీవలరాజీనామా చేసిన విషయం విదితమే. వయోభారంతో ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు దర్శకేంద్రుడు తెలియజేశారు.