కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారంపై రేవంత్ స్పందించారు. తాను పార్టీ మారే విషయంపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు.
గతంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన విషయం విదితమే. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీలో చేరుతారనే వార్తలు జోరుగా ప్రచారమవుతున్నాయి. రేవంత్ త్వరలో బీజేపీలో చేరుతారని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు.
కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతారనే ప్రచారంపై రేవంత్ స్పందించారు. తాను పార్టీ మారే విషయంపై వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా అసత్య ప్రచారమని కొట్టి పారేశారు. తనపై జరుగుతున్నది దుష్ర్పచారమని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ మారనని అన్నారు. తనపై నమ్మకంతో రాహుల్ గాంధీ తనకు మల్కాజ్‌గిరి ఎంపీ టిక్కెట్ ఇచ్చారని, ఈ నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకం ఉంచి తనను గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని రేవంత్ అన్నారు.
ఇక కొడంగల్‌లో పోటీ చేసిన తాను ఓడిపోయినా ప్రశ్నించే గొంతు ఉండాలన్న నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి ప్రజలకు తనకు ఎంపీగా అవకాశం కల్పించారని రేవంత్ అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెస్‌ను వీడేది లేదని, తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని రేవంత్ అన్నారు. మోడీ, అమిత్ షా చేస్తున్న రాజకీయాలను తిప్పికొడతామని రేవంత్ స్పష్టం చేశారు.