బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కొత్త అవతారం..

బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఇప్పటివరకు అందరికీ ఓ గాయకుడిగానే తెలుసు. కానీ రాహుల్ సిప్లిగంజ్ కు ఇప్పుడున్న ఫేమ్ అంతా ఇంతా కాదు. అంతా బిగ్ బాస్ మహిమని చెప్పుకోవాలి. మరి ఆ రియాల్టీ షో అందించిన పేరుప్రఖ్యాతులు రాహుల్ కు సినిమాలో నటించే చాన్స్ అందించాయి. త్వ‌ర‌లోనే ఈ టాలీవుడ్ సింగర్ నటుడిగా తెరంగేట్రం చేయబోతున్నాడు. సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ అనే చిత్రంలో తాను కూడా నటిస్తున్నట్టు రాహుల్ వెల్లడించాడు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి గొప్పనటుల సరసన తాను నటిస్తుండడం పట్ల ఎంతో సంతోషిస్తున్నానని, ఈ అవకాశాన్ని తనకు ప్రసాదించిన దర్శకుడు కృష్ణవంశీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని సోషల్ మీడియాలో వివరించాడు.

షూటింగ్ కోసం ఎంతో ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నానని, తానెంతో అదృష్టవంతుడ్నని భావిస్తున్నానని తెలిపాడు. మీ దీవెనలు కావాలంటూ తన పోస్టులో పేర్కొన్నాడు. కాగా, బిగ్ బాస్ ఇంటికి వెళ్లకముందు మహర్షి సినిమాలో పాలపిట్ట పాట పాడాడు రాహుల్‌. దాంతోపాటు 90ఎమ్ఎల్ సినిమాలో కూడా ఓ పాట పాడాడు. ఇక బిగ్‌బాస్ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వచ్చిన తర్వాత ఓ ప్రైవేట్ సాంగ్‌తో పాటు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో కూడా పాడే అవ‌కాశం ద‌క్కించుకున్నాడంటే మామూలు విష‌యం కాద‌నే చెప్పాలి.