రాజ్‌త‌రుణ్ కారుకు యాక్సిడెంట్‌… పెను ప్ర‌మాదం నుంచి ఎస్కేప్‌..

535

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌తరుణ్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు నార్సింగ్‌ సమీపంలో అల్కాపూర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదానికి గురైంది. రాజ్‌త‌రుణ్ ఔట‌ర్ రింగోరోడ్డుపై త‌న కారులో వెళుతుండ‌గా మంగ‌ళ‌వారం ఉద‌యం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదం నుంచి రాజ్‌తరుణ్‌ క్షేమంగా బయటపడినట్టు తెలిసింది.


రాజ్ ప్ర‌యాణిస్తోన్న కారు చాలా స్పీడ్‌గా వెళుతున్న క్ర‌మంలోనే డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్ర‌మాదం జ‌రిగ‌గా… కారు అద్దాలు ధ్వ‌సంమ‌య్యాయి. యాక్సిడెంట్‌ అనంతరం ఆయన వేరే కారులో వెళ్లిపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే రాజ్‌త‌రుణ్ త‌న కారును రోడ్డు ప‌క్క‌నే వ‌దిలేసి వెళ్ల‌డంతో కొన్ని అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏమైందో తెలుసుకునేందుకు కొంద‌రు అత‌డికి ఫోన్ చేయ‌గా… ఫోన్ స్విచ్ఛాప్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.

ఈ విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థలానికి చేరుకుని కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం రాజ్ దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. స‌త్య సాయి ఆర్ట్స్ ప‌తాకంపై కెకె రాధామోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రాజ్ కారుకు యాక్సిడెంట్ అయిన‌ట్టు తెలియ‌డంతో టాలీవుడ్ ప్ర‌ముఖులు ఒక్క‌సారిగా ఆందోళ‌న చెందారు. అయితే, ఈ ప్రమాదం నటుడు తరుణ్‌ కారుకు జరిగినట్టు వార్తలు రావడంతో ఆయన ఖండించారు.